కశ్మీరీలను భారత్ హింసిస్తోంది.. UNOలో ఇమ్రాన్ వాగుడు

కశ్మీరీలను భారత్ హింసిస్తోంది.. UNOలో ఇమ్రాన్ వాగుడు

న్యూయార్క్ : కశ్మీరీలను భారత్ హింసిస్తోందన్నారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో  ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. పుల్వామా దాడికి భారత బలగాలే కారణం అన్నారు. మోడీ ఎన్నికల ప్రచారం మొత్తం పాకిస్థాన్ టార్గెట్ గానే సాగిందన్నారు. కశ్మీర్ లో 9లక్షల మంది సాయుధ బలగాలను మోహరించి అక్కడి ప్రజల హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. 54 రోజులుగా కశ్మీరీలను హింసిస్తున్నారని ఆరోపించారు ఇమ్రాన్ ఖాన్.

భారత ప్రధాని మోడీ క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు ఇమ్రాన్ ఖాన్. క్రూరత్వంతో మోడీ కళ్లు మూసుకుపోయాయని చెప్పారు. చర్చలకు ఆహ్వానించినా కూడా మోడీ రాలేదని భారత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. బాలాకోట్ లో 350 మంది ఉగ్రవాదులను చంపేశామని భారత్ చెప్పుకుంటోందని.. కానీ.. అక్కడ పది చెట్లు కూడా కూలిపోలేదని అన్నారు. పుల్వామా దాడికి ఇప్పటివరకు ఆధారాలు చూపలేదన్నారు. కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రపంచం స్పందించడం లేదని అన్నారు.  భారత్ పెద్ద మార్కెట్ కాబట్టే.. ప్రపంచం నోరు మెదపడం లేదన్నారు. ప్రపంచం 1.2బిలియన్ డాలర్ల మార్కెట్ వెనుక ఉంటుందా… లేక మానవత్వం వైపు ఉంటుందా తేల్చుకోవాలన్నారు. హిట్లర్, ముస్సోలినిల విధానాల ఆధారంగా RSS ఏర్పడిందన్నారు ఇమ్రాన్ ఖాన్.