ఇమ్రాన్‌ నాకు మంచి దోస్త్‌: మున్‌మున్‌ సేన్‌

ఇమ్రాన్‌ నాకు మంచి దోస్త్‌: మున్‌మున్‌ సేన్‌

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ తన ఫ్రెండేనని, అవసరమైతే ఆయనతో మాట్లాడతానని సినీనటి, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మున్‌మున్‌ సేన్‌ అన్నారు. అయితే జమ్మూ కశ్మీర్‌ వంటి అంశాలపై మాట్లాడబోనని, అందుకు తనకన్నా సమర్థులైన లీడర్లు ఎందరో ఉన్నారని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ విదేశాల్లో ఇండియా ప్రతిష్ట పెంచినా సొంత దేశంలో సమస్యలను మాత్రం గాలికొదిలేశారని విమర్శించారు. తాజాగా ఆమె పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు.

‘‘జాతీయవాదం పేరుతో రాజకీయాలుచేయడం, ఎన్నికల ప్రచారంలో పాక్ ను లాగడం వంటివి నాకు నచ్చదు. విభజించు–పాలించు పాలి-టిక్స్‌ చాలా డేంజర్‌’’ అని అన్నారు. ఇండియా–పాక్‌ మధ్య టెన్షన్‌ పరిస్థితులు ఉన్నా ఇమ్రాన్‌తో మాట్లాడతారా అని ప్రశ్నించగా.. ‘‘ఎందుకు మాట్లాడను.తప్పకుండా మాట్లాడతా. ఆయన నా ఫ్రెండ్‌. మా ఆయనకు కూడా మంచి మిత్రుడు. కోల్‌కతాలో ఆయనకు చాలామంది ఫ్రెండ్స్‌ ఉన్నారు. మా మధ్య ఫ్రెండ్ షిప్ కు మించి ఏమీ లేదు’’ అని చెప్పారు.కేంద్రం కోరితే ఇండియా తరఫున వెళ్లి పాక్ తోచర్చలు జరుపుతారా అని అడగ్గా .. ‘‘నో. నాకునేనుగా ఆ పని చేయను. నన్ను అలా అడుగుతారనికూడా అనుకోను. దేశంలో నాకన్నా సీనియర్లు, సమర్థులైన లీడర్లు ఎంతో మంది ఉన్నారు’’ అని చెప్పారు.

మోడీ మళ్లీ గెలిస్తేనే కాశ్మీర్‌ వంటి సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఇమ్రాన్ ఖాన్‌ కామెంట్లపై స్పందిస్తూ.. ‘‘దీనిపై నేనేం మాట్లాడను. ఇది పూర్తిగా రాజకీయపరమైనది. లీడర్లు రోజుకో మాట మాట్లాడుతుంటారు’’ అన్నారు. పార్లమెంట్ కు మోడీ రెగ్యులర్‌గా రారని, ఆయన స్పీచ్ ను తాను రెండుమూడుసార్లకు మించి వినలేదని, అవి కూడా ఎన్నికల ప్రచారాన్ని తలపించాయని మున్‌మున్‌ చెప్పారు.‘‘మోడీ విదేశాల్లో ఇండియాకు మంచిపేరే తెచ్చారు. కానీ ఇక్కడ సమస్యలను మాత్రం పట్టించు కోవడంలేదు. హడావుడిగా జీఎస్టీ తెచ్చి జనాన్ని ఇబ్బందులు పెట్టారు. యువతకు జాబ్ లు ఇవ్వలేక పోయారు’’అని విమర్శించారు.

బంకూరా సీటు నుంచి సీపీఎం తరఫున తొమ్మిదిసార్లు ఎంపీగా నెగ్గిన బసుదేవ్‌ ఆచార్యను 2014 ఎన్నికల్లో ఓడించి మున్‌మున్‌సేన్‌ లోక్ సభలో అడుగుపెట్టారు. ప్రస్తుతం అసన్ల్‌ నుంచి బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ, కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియోతో పోటీపడుతున్నారు. ‘‘బాబుల్‌ ఓ పిల్లవాడు. అసన్ల్‌లో మోడీ, మమత మధ్యే పోటీ. నేను తప్పక గెలుస్తానన్న నమ్మకం ఉంది’’ అని చెప్పారు.80, 90ల్లో పాక్‌ క్రికెట్‌ టీంలో ఇమ్రాన్న్‌ వెలిగి పోతున్నప్పడు ఆయనకు మున్‌మున్‌తో స్నేహం ఏర్పడింది. పేపర్లు, టాబ్లాయిడ్లు, గాసిప్‌ మేగజైన్లు వీరిపై అనేక స్టోరీలు అల్లేవి.