స్టేడియంలో తొక్కిసలాట.. 125 మంది మృతి

స్టేడియంలో తొక్కిసలాట.. 125 మంది మృతి
  • ఇండోనేసియాలోని మలంగ్​ సిటీలో ఘోరం

మలంగ్ (ఇండోనేసియా): ఇండోనేసియాలో ఘోరం జరిగింది. ఫుట్ బాల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో అల్లర్లు, తొక్కిసలాట చోటుచేసుకోవడంతో 125 మంది బలైపోయారు. మరో 100 మంది ఆస్పత్రుల పాలయ్యారు. సాకర్ (ఫుట్ బాల్) చరిత్రలోనే స్టేడియాల్లో జరిగిన గొడవల్లో అతి దారుణమైన ఈ ఘటన శనివారం రాత్రి 10 గంటలకు తూర్పు జావా, మలంగ్ సిటీలోని కంజురుహాన్ స్టేడియంలో జరిగింది. అల్లర్లలో ఇద్దరు పోలీసులు చనిపోగా.. తొక్కిసలాటలో చాలామంది చిన్నారులు, మహిళలు కూడా మృతిచెందారు.

తొక్కిసలాటలో కింద పడటంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించడం వల్ల ఊపిరాడకే చాలామంది చనిపోయినట్లు భావిస్తున్నారు. ఫుట్ బాల్ స్టేడియాల్లో టియర్ గ్యాస్ ప్రయోగించరాదన్న ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ అసోసియేషన్ ‘ఫిఫా’ గైడ్ లైన్స్​ను కూడా పోలీసులు పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. స్టేడియం సామర్థ్యం కన్నా ఎక్కువమందిని అనుమతించడం  మృతుల సంఖ్య పెరగడానికి కారణమైందని చెప్తున్నారు.

గొడవ ఇలా మొదలైంది.. 

మలంగ్ సిటీలోని కంజురుహాన్ స్టేడియంలో శనివారం రాత్రి 8 గంటలకు అరెమా ఫుట్ బాల్ క్లబ్, పెర్సెబాయ సురబాయ ఫుట్​బాల్ క్లబ్ టీంల మధ్య మ్యాచ్ షురువైంది. మ్యాచ్​కు దాదాపు 42 వేల మంది ప్రేక్షకులు, అభిమానులు హాజరయ్యారు. స్టేడియంలో గొడవలను నివారించాలన్న ఉద్దేశంతో నిర్వాహకులు పెర్సెబాయ క్లబ్ ఫ్యాన్స్ రాకుండా నిషేధం విధించారు. దీంతో స్టేడియంలో దాదాపు అరెమా క్లబ్ ఫ్యాన్సే ఉన్నా రు. రాత్రి 10 గంటలకు ఆట ముగిసింది. పెర్సెబాయ టీం చేతిలో అరెమా ఎఫ్ సీ 3‌‌‌‌–2 తేడాతో ఓడిపోయింది. గత 23 ఏండ్లలో పెర్సెబాయపై ఎన్నడూ ఓడిపోని తమ అభిమాన జట్టు ఇప్పుడు పరాజయం చెందడంతో ఆగ్రహం చెందిన ఫ్యాన్స్ స్టేడియంలోకి దూసుకెళ్లారు. ఈసారి ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందో చెప్పాలంటూ క్లబ్ అధికారులు, ఆటగాళ్లు, పోలీసులపై వాటర్ బాటిళ్లు, ఇతర వస్తువులతో దాడికి యత్నించారు. 

అక్కడికక్కడే 34 మంది బలి..   

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేస్తూ ఆందోళనకారులను స్టాండ్స్ వైపు తరిమారు. మరోవైపు నేరుగా స్టాండ్స్ లోకే టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. దీంతో స్టాండ్స్ లో ఉన్నోళ్లు గేటు వైపు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. చాలామంది కింద పడిపోవడం.. టియర్ గ్యాస్ వల్ల కమ్మిన పొగలతో కింద పడ్డవాళ్లు కనిపించక వెనక నుంచి వచ్చిన వాళ్లు తొక్కుకుంటూ వెళ్లారు. అదేసమయంలో గేటు వద్దకు వేలాది మంది పరుగెత్తడంతో అక్కడ కూడా తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఫలితంగా స్టేడియంలో అప్పటికప్పుడే 34 మంది బలైపోయారు. దీంతో స్టేడియం నుంచి బయటకు వచ్చిన ఫ్యాన్స్ పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు.

ఆస్పత్రికి తీసుకెళ్తుంటే మధ్యలోనే..  

గాయాల పాలైన మరో 300 మందిని పోలీసులు ఆస్పత్రులకు తరలించారు. దారిలో వెళ్తుండగా, ట్రీట్​మెంట్ పొందుతూ చాలామంది చనిపోయారు. మొదట 174 మంది చనిపోయారని వార్తలు వచ్చాయి. అయితే, కొంతమందిని రెండుసార్లు కౌంట్ చేయడం వల్లే మృతుల సంఖ్య ఎక్కువగా వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది.

విచారణకు ప్రెసిడెంట్ ఆదేశం

స్టేడియంలో తొక్కిసలాటపై ప్రెసిడెంట్ జోకో విడొడో సమగ్ర విచారణకు ఆదేశించారు. దేశ ఫుట్ బాల్ చరిత్ర లో ఇదే చివరి విషాదం కావాలని ఆకాంక్షించారు. పరిస్థితి చల్లబడేదాకా దేశంలో ఎలాంటి ఫుట్ బాల్ మ్యాచ్​లు నిర్వహించొద్దని ఆదేశిం చారు. ప్రస్తుతం కొనసాగతున్న లీగ్ ను రద్దు చేయాలని ఫుట్ బాల్ అసోసియేషన్​కు స్పష్టంచేశారు. బాధిత కుటుంబాలకు ఫుట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండోనేసియా క్షమాపణలు చెప్పింది.