గత 30 ఏళ్లలో ఏటా ఒక ఎయిర్​లైన్స్​ మాయం

గత 30 ఏళ్లలో ఏటా ఒక ఎయిర్​లైన్స్​ మాయం

న్యూఢిల్లీ: దేశంలో గత 30 ఏళ్లలో సగటున ఏడాదికి ఒక షెడ్యూల్డ్​ ఎయిర్​లైన్స్​  మూతపడింది. ఏవియేషన్​ రంగంలోకి ప్రైవేట్​ కంపెనీలు మొదటిసారి అడుగు పెట్టింది సుమారు 30 ఏళ్ల కిందటే. వాడియా గ్రూప్​ నాయకత్వంలోని గో ఫస్ట్​ ఎయిర్​లైన్స్​ తాజాగా ఈ జాబితాలోకి చేరింది. నవంబర్​ 1996లో  ఈస్ట్​వెస్ట్​ ట్రావెల్స్​ అండ్ ట్రేడ్​ లింక్​ లిమిటెడ్​ మూతపడింది. ఈ కంపెనీ అప్పటికి కార్యకలాపాలు మొదలుపెట్టి కేవలం రెండేళ్లయింది. 1996 లోనే మరో ఎయిర్​లైన్స్​ సంస్థ మోడిలుఫ్ట్​ లిమిటెడ్​ కూడా కనుమరుగయింది. 1994 లో మొదటిసారిగా ప్రైవేట్​ ఎయిర్​లైన్స్​ మన దేశంలో కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాయి. అప్పటి నుంచి చూస్తే కనీసం 27 షెడ్యూల్డ్​ ఎయిర్​లైన్స్​ కంపెనీలు మూతపడటమో లేదా చేతులు మారడమో జరిగింది. కరోనా మహమ్మారి నుంచి బయపడిన తర్వాత దేశంలోని ఎయిర్​లైన్స్​సెక్టార్​ ఇటీవలే జోరందుకుంది. ప్రాట్​అండ్​ విట్నీ ఇంజిన్లు అందుబాటులో లేకపోవడంతో ఆర్థికంగా కష్టాలలో కూరుకుపోయిన గో ఫస్ట్​ చేతులెత్తేసింది. ఇంజిన్లు లేక  తనకున్న విమానాలలో సగానికి పైగా విమానాలను నేలకే పరిమితం చేసింది. దీంతో ఆపరేషన్స్​ నిర్వహణ ఆ కంపెనీకి కష్టంగా మారింది.

2020లో మూడు కంపెనీలు..

జూమ్​ ఎయిర్​ పేరుతో సేవలు అందించిన జెక్సస్​ ఎయిర్​ సర్వీసెస్​, డెక్కన్​ చార్టర్డ్​ , ఒడిషా ఏవియేషన్​ కంపెనీలు 2020 లో కార్యకలాపాలు నిలిపివేశాయి. 2022లో మరో కంపెనీ హెరిటేజ్​ ఏవియేషన్​ విమానాలు ఎగరడం నిలిచిపోయింది. దేశంలో ఫుల్​ సర్వీస్​ క్యారియర్​గా పేరొందడమే కాకుండా, ఒక పెద్ద ఆపరేటర్​గా మారిన తర్వాత జెట్​ ఎయిర్​వేస్​ లిమిటెడ్​ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ కంపెనీ ఆర్థిక కష్టాలతో 2019 లోనే ఆపరేషన్స్​ నిలిపివేసింది. ఈ కంపెనీని వేరొక కన్సార్టియమ్​ ఇన్​సాల్వెన్సీ రిజల్యూషన్​ ప్రాసెస్​లో  కొనుగోలు చేసింది. అయినా ఇంకా కార్యకలాపాలు మొదలుపెట్టలేదు. జెట్​లైట్​(అంతకు ముందు పేరు సహారా ఎయిర్​లైన్స్​) కూడా 2019 లోనే నిలిచిపోయింది. విలాసవంతమైన ఎంట్రప్రెనార్​గా పేరొందిన విజయ్​మల్యా నడిపిన కింగ్​ఫిషర్​ ఎయిర్​లైన్స్​ కూడా 2012 లో మూతపడింది. దీనికంటే ముందు, 2008 లో ఎయిర్​దక్కన్​ పేరుతో సేవలందించిన దక్కన్​ ఏవియేషన్​ కంపెనీని కింగ్​ఫిషర్​ కొనేసింది. దేశంలో లో కాస్ట్​ ఎయిర్​ ట్రావెల్​ను అందుబాటులోకి తెచ్చిన మొదటి కంపెనీ దక్కన్​ ఏవియేషనే కావడం విశేషం.

2017లో ఏకంగా 5 ఎయిర్​లైన్స్

2017 సంవత్సరంలోనైతే ఏకంగా 5 ఎయిర్​లైన్స్​ కంపెనీలు చేతులెత్తేశాయి. ఎయిర్​కార్నివాల్​, ఎయిర్​ పెగాసస్​, రెలిగేర్​ ఏవియేషన్​, ఎయిర్​ కోస్టా, క్విక్​జెట్​ కార్గో ఎయిర్​లైన్స్​ కంపెనీలు ఆ ఏడాదిలో  మూతపడ్డాయి. దక్కన్​ కార్గో అండ్​ ఎక్స్​ప్రెస్​లాజిస్టిక్స్​ 2014 లోను, ఆర్యన్​ కార్గో ఎక్స్​ప్రెస్​ 2011 లోను, పారమౌంట్​ ఎయిర్​వేస్​ 2007 లోను, ఎండీఎల్​ఆర్​ ఎయిర్​లైన్స్​ 2009 లోను, జాగ్సన్​ ఎయిర్​లైన్స్​ 2008 లోను, ఇండస్​ ఎయిర్​వేస్​ 2007 లోను తమ తమ కార్యకలాపాలు నిలిపివేశాయి. ఎన్​ఈపీసీ మైకాన్​, స్కైలైన్​ ఎన్​ఈపీసీ (దమానియా ఎయిర్​వేస్​) కంపెనీలు 1996, 1997 సంవత్సరాలలో మూతపడ్డాయి. అధికారిక డేటా ప్రకారం లుఫ్తాన్సా కార్గో 2000 సంవత్సరంలో తన కార్యకలాపాలు నిలిపివేసింది. ఏవియేషన్​ మార్కెట్​ వేగంగా ఎదుగుతున్న దేశాలలో ఇండియా ముందు వరసలో నిలుస్తోంది. ఏటేటా విమాన ప్రయాణికుల సంఖ్య దేశంలో భారీగా పెరుగుతోంది. దేశంలో ఇప్పుడు నడుస్తున్న ఎయిర్​లైన్స్​ కంపెనీలలో ఒక్క అలయన్స్​ ఎయిర్​ను మినహాయిస్తే మిగిలినవన్నీ ప్రైవేటు కంపెనీలే. 

17 సంవత్సరాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గో ఫస్ట్​ వాలంటరీగా ఇన్​సాల్వెన్సీ కోసం పిటిషన్​ ఫైల్​ చేసుకుంది. ఈ పిటిషన్​ను ఎన్​సీఎల్​టీ గురువారం విచారించనుంది. జెట్​ఎయిర్​వేస్​ తర్వాత ఇన్​సాల్వెన్సీ ప్రాసెస్​ కిందకి వచ్చిన రెండో కంపెనీ ఇదే. ఇన్​సాల్వెన్సీ రిజల్యూషన్​ ప్రాసెస్​లో జెట్​ఎయిర్​వేస్​ను జలన్​ కల్​రాక్​ కన్సార్టియమ్​ చేజిక్కించుకుంది. కానీ, ఓనర్​షిప్​ ఇంకా బదిలీ కాకపోవడంతో ఆపరేషన్స్​ మొదలవలేదు. ఓనర్​షిప్​ బదిలీకి సంబంధించి జెట్​ఎయిర్​వేస్​ రుణదాతలు, కొత్త కొనుగోలుదారుల మధ్య వివాదం నడుస్తోంది.