పౌరులను కాల్చలేక వాహనాలను ధ్వంసం చేసుకుంటున్న రష్యన్ సైనికులు

 పౌరులను కాల్చలేక వాహనాలను ధ్వంసం చేసుకుంటున్న రష్యన్ సైనికులు

కీవ్/మాస్కో: ఉక్రెయిన్‌‌‌‌పై దండెత్తి 8 రోజులైనా రష్యా పెద్దగా సాధించింది ఏమీ లేదు. కేవలం ఒక్క సిటీని స్వాధీనం చేసుకుంది. భారీ సంఖ్యలో సైనికులను కోల్పోయింది. గురువారం రష్యా కీలక మేజర్ జనరల్ కూడా ఉక్రెయిన్ సైన్యం చేతిలో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అతిపెద్ద కాన్వాయ్‌‌‌‌తో భయపెట్టాలని చూసినా.. పెద్దగా ఫలితంలేదు. ఉక్రెయిన్‌‌‌‌ నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన, ఇంధన సమస్యలతో కాన్వాయ్ నిలిచిపోయినట్లు బ్రిటన్, అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి. మెయింటెనెన్స్ సరిగ్గా లేక టైర్లు ఊడిపోతున్నాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్ పౌరులను కాల్చలేక, రష్యన్ సైనికులు తమ వాహనాలను తామే ధ్వంసం చేసుకుంటున్నారు. ఉక్రేనియన్ ప్రతిఘటనను రష్యా చాలా తక్కువగా అంచనా వేసిందని, ఇది ఆ దేశ నిఘా వర్గాల వైఫల్యమని అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మైఖేల్ వికర్స్ అన్నారు. పుతిన్ దాడి తీవ్రత చాలా తక్కువగా ఉందని, ఇదో పెద్ద డిజాస్టర్ అని చెప్పారు. అయితే ప్రాథమికంగా ఎదురైన ఓటములతో రష్యా మరింత బలంగా ఢీకొట్టే అవకాశాలున్నాయని ఎక్స్‌‌‌‌పర్టులు అంటున్నారు. తర్వాతి స్టేజ్‌‌‌‌లో భారీ సంఖ్యలో దళాలను పంపొచ్చని, బాంబులతో కోలుకోలేని విధ్వంసానికి దిగొచ్చని, పెద్ద సంఖ్యలో పౌరులు చనిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.