ఉల్లి బస్తాల లోడులో.. తాబేళ్ల మూటలు

ఉల్లి బస్తాల లోడులో.. తాబేళ్ల మూటలు

అనుమానంతో తనిఖీ చేసి ఆశ్చర్యపోయిన పోలీసులు..

ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తింపు

తూర్పుగోదావరి: సాధారణ గూడ్స్ ట్రాలీ ఆటో అది.. ఉల్లి బస్తాలు వేసుకుని వెళుతోంది. అయితే వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు ఉల్లి బస్తాల గూడ్సు ట్రాలీని అలా చూసి వదిలివేసేవారే. అయితే ఆటో ట్రాలీలో నుండి పాచి నుండి వచ్చే దుర్వాసన వస్తుండడంతో అనుమానంతో తనిఖీ చేస్తుంటే పెంపుడు జంతువుల శబ్దాల మాదిరి వినిపించాయి. తడిచినట్లు కనిపిస్తున్న బస్తాలను పోలీసులు విప్పి చూస్తే.. తాబేళ్లు బిలబిలమంటూ చెంగున దూకడంతో పోలీసులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు.  తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ దగ్గర జరిగిందీ ఘటన.

సాధారణ తనిఖీలలో భాగంగా ఇవాళ వాహనాలను తనిఖీ చేస్తుండగా గూడ్సు ఆటో ఉల్లి .. ఇతర బస్తాలతో వెళుతోంది. ఎలాంటి అనుమానం రాకుండా తాబేళ్లను బస్తాల్లో మూటకట్టి తరలిస్తున్నారు. తడిచినట్లు ప్రత్యేకంగా కనిపిస్తున్న బస్తాలపై అనుమానం వచ్చింది.  పోలీసులు ఒకదాన్ని విప్పి చూస్తే తాబేళ్లు దూకాయి. నాలుగు బస్తాల్లో మొత్తం 435 తాబేళ్లను అక్రమంగా ఒడిశాకు తరలిస్తున్నట్లు గుర్తించారు. తూర్పుగోదావరిజిల్లా  రావులపాలెం నుండి ఒరిస్సాకు తరలిస్తున్నట్టు చెప్పారు ఇద్దరు నిందితులు. అటవీశాఖ అధికారి దుర్గాకుమార్ బాబు ఇద్దరు వ్యక్తులపై వన్యప్రాణి పరిరక్షణ చట్టంక్రింద కేసు నమోదు చేసి తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు.