హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రన్ కేసు వెలుగులోకి వచింది. కారుతో ఢీకొట్టడమే కాకుండా.. తనతో గొడవ పడుతున్నాడనే కోపంతో ఉన్మాదంగా ప్రవర్తించాడు కారు డ్రైవర్. తన కారు కి అడ్డంగా నిలబడి పోనివ్వకుండా చేస్తున్నాడనే కోపంతో అలాగే అతడిని ఢీకొట్టుకుంటూ వెళ్ళాలని చూశాడు. అయితే బాధితుడు కారు బానెట్ పట్టుకుని అలాగే ఉండిపోయాడు. దీంతో అతన్ని అలాగే రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు ఉన్మాది డ్రైవర్. మిగతా వాహనదారులు ఈ ఘటనను వీడియో తీయడంతో ఈ దారుణం భయటపడింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ దారుణం. ఈ ఘటనలో తండ్రీకొడుకులను కారుతో ఢీకొట్టి వారిపై దాడి చేశాడు నిందితుడు. ఎస్ కె జిలానీ, అతని కుమారుడు ఫైసల్ గాయత్రీ నగర్ నుండి ఎల్బీ నగర్ వైపు బైక్‌పై వెళ్తుండగా, ఒక కారు వారిని వెనుక నుండి ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు డ్రైవర్ తో వాగ్వాదానికి దిగారు బాధితులు. వాగ్వాదం తీవ్రమై గొడవగా మారింది. దీంతో బాధితులపై దాడికి పాల్పడ్డాడు డ్రైవర్.
ఈ క్రమంలో డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించగా, జిలానీ వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. కానీ కారును ఆపకుండా దాదాపు రెండు కిలోమీటర్ల పాటు కారు బానెట్ పై ఉన్న అతడిని ఈడ్చుకుపోయాడు. బాధితుడు గాయాలతో నొప్పితో అరుస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా రాక్షసత్వం ప్రదర్శించాడు డ్రైవర్.
కారు బాలాపూర్ క్రాస్‌రోడ్స్ వరకు వేగంగా వెళ్లి, వెనక్కి తిరిగి, చివరకు మండమల్లమ్మ జంక్షన్ దగ్గర స్థానికులు అడ్డగించడంతో పట్టుబడినట్లు సమాచారం.ఆయితే కారు అక్కడే వదిలేసి నిందితుడు పారిపోయాడని చెబుతున్నారు స్థానికులు.ఈ ఘటనలో బాధితుడు ఫైసల్ రెండు కాళ్లు విరిగిపోయి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. బాధితుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
