హోరాహోరీ మ్యాచ్.. పాక్ విజయం

హోరాహోరీ మ్యాచ్.. పాక్ విజయం

షార్జా వేదికగా జరుగుతున్న ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్, పాక్  జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ విజయాన్ని సాధించేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. చివరి ఓవర్ లో మరో నాలుగు బంతులు మిగిలి ఉన్నాయనగా.. 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసి పాక్ గెలుపు ఢంకా మోగించింది. అయితే ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లు విజృంభించడంతో మ్యాచ్ ఇంత టఫ్ గా మారిందని చెప్పొచ్చు. ఆఫ్ఘన్ బౌలర్లు ఫజల్ హఖ్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్ మాలిక్ చెరో మూడు వికెట్లు పడగొట్టి పాక్ నడుము విరిచారు. మరో బౌలర్ రశీద్ ఖాన్ కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు పాక్ బ్యాట్స్ మెన్ షాదాబ్ ఖాన్ 26 బంతుల్లో 36 పరుగులు చేసి జట్టు స్కోర్ బోర్డు ముందుకు కదలడంలో కీలక పాత్ర పోషించాడు.  చివర్లో పాక్ బ్యాట్స్ మెన్ నసీం షా 4 బంతుల్లో 2 సిక్సర్లు బాదడం ద్వారా చేసిన 14 పరుగులే పాక్ కు విజయాన్ని సాధించిపెట్టాయి.

ఇక అంతకుముందు టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.  అఫ్గానిస్థాన్ బ్యాటింగ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన హజ్రతుల్లా (21), గర్బాజ్ (17) తొలి వికెట్‌కి 36 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత వచ్చిన ఇబ్రహీం దూకుడుగా ఆడేసినా.. కరీమ్ (15), నజీబుల్లా (10), నబీ (0), రషీద్ ఖాన్ (18) తక్కువ స్కోరుకే ఔటైపోయారు. దాంతో అఫ్గానిస్థాన్ 129 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ  టీమ్‌లో ఇబ్రహీం జద్రాన్ (35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాకిస్థాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్ రెండు వికెట్లు పడగొట్టగా.. నసీమ్ షా, మహ్మద్ హొస్నైన్, నవాజ్, షదాబ్ ఖాన్ తలో వికెట్ తీశారు.