ట్రిపుల్ తలాక్ బిల్లు పాస్

ట్రిపుల్ తలాక్ బిల్లు పాస్
  • అనుకూలంగా 99‌‌ ఓట్లు.. వ్యతిరేకంగా 84 ఓట్లు
  • రాజ్యసభలో మూడోసారికి మోడీ సర్కారుకు విక్టరీ
  • నేడో రేపో రాష్ట్రపతి సంతకంతో చట్ట రూపంలోకి..
  • ఇన్​స్టంట్​ ట్రిపుల్​ తలాక్​కు మూడేండ్లు జైలు శిక్ష

న్యూఢిల్లీ:ఇక నుంచి ఇన్​స్టంట్​ట్రిపుల్​ తలాక్​ నిషేధం. దాన్ని ఉల్లంఘించే  భర్తలకు మూడేండ్ల జైలు శిక్ష తప్పదు.  ‘ముస్లిం ఉమెన్​(ప్రొటెక్షన్​ ఆఫ్​ రైట్స్​ ఆన్​ మ్యారేజ్​) బిల్లు‌‌‌‌–2019’కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇప్పటికే రెండు సార్లు రాజ్యసభలోకి వచ్చి వీగిపోయిన ఈ బిల్లు.. గట్టెక్కుతుందా లేదా అన్న ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు పాస్​ అయింది. గత వారం లోక్​సభ  కూడా ఓకే చెప్పింది. ఉభయ సభల ఆమోదం లభించడంతో.. నేడో రేపో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ కూడా సంతకం చేయనున్నారు. ఆ ప్రక్రియ ముగియగానే చట్టరూపంలోకి రానుంది. మోడీ సర్కార్​ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ బిల్లును రాజ్యసభలో ఆమోదింపజేయడంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మంగళవారం రాజ్యసభలో బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ ప్రవేశపెట్టారు.

సుమారు నాలుగున్నర గంటలపాటు బిల్లుపై సభలో చర్చ జరిగింది. ట్రిపుల్​తలాక్​ నిషేధానికి తాము వ్యతిరేకం కాదని, అయితే బిల్లులో లోపాలు ఉన్నాయని కాంగ్రెస్​ రాజ్యసభ సభ పక్ష నేత గులాం నబీ ఆజాద్​తో పాటు పలువురు ప్రతిపక్ష సభ్యులు తప్పుబట్టారు. సివిల్​ నేరాన్ని క్రిమినల్​ నేరంగా పరిగణిస్తూ బిల్లు రూపొందించారని, ట్రిపుల్​ తలాక్​ చెప్పే భర్తకు మూడేండ్ల జైలు శిక్ష విధించే క్లాజ్​ను తొలగించాలని, బిల్లును సెలెక్ట్​ కమిటీకి పంపించాలని పట్టుబట్టారు. ఈ అంశంపై ఓటింగ్​కు డిమాండ్​ చేశారు. సెలెక్ట్​ కమిటీకి పంపాలన్న అంశంపై ఓటింగ్​ నిర్వహించగా.. 100 మంది వ్యతిరేకంగా, 84 మంది అనుకూలంగా ఓటు వేయడంతో ఆ ప్రతిపాదన వీగిపోయింది. పలు సవరణలపైనా ఓటింగ్​ నిర్వహించినప్పటికీ సభలో మద్దతు లభించలేదు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ‘ముస్లిం ఉమెన్​(ప్రొటెక్షన్​ ఆఫ్​ రైట్స్​ ఆన్​ మ్యారేజ్​) బిల్లు‌‌‌‌–2019’ పై స్లిప్పుల పద్ధతిలో ఓటింగ్​కు రాజ్యసభ చైర్మన్​ వెంకయ్యనాయుడు అనుమతిచ్చారు. సభలో సభ్యుల దృష్ట్యా ఎన్డీయే కన్నా ప్రతిపక్షాలు, తటస్థ పార్టీల బలమే ఎక్కువ. ఈ పరిణామాల నేపథ్యంలో బిల్లు పాసవడం కష్టమని అందరూ భావించినప్పటికీ.. కొన్ని పార్టీలు సభ నుంచి వాకౌట్​ చేయడం, మరికొన్ని పార్టీలు సభకు రాకుండా దూరం పాటించడం కలిసి వచ్చింది. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్​, టీఎంసీ, ఎన్సీపీ, ఎస్పీ పార్టీలకు చెందిన సభ్యుల్లో కొందరు సభకు డుమ్మా కొట్టడం ప్లస్​ అయింది. బిల్లును వ్యతిరేకిస్తున్న ఎన్డీయే కూటమిలోని జేడీయూ, అన్నాడీఎంకే  ఓటింగ్​కు దూరంగా ఉన్నాయి. తటస్థ పార్టీ బీజేడీ బిల్లుకు మద్దతు ప్రకటించింది.

రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య  241 కాగా..  ఓటింగ్​ సమయంలో 183 మంది మాత్రమే హాజరయ్యారు. బిల్లుకు అనుకూలంగా 99‌‌ ఓట్లు పడగా.. వ్యతిరేకంగా 84 ఓట్లు పడ్డాయి. దీంతో బిల్లు ఆమోదం పొందినట్లు  చైర్మన్​ వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఈ నెల 25న లోక్​సభలో 303: 82 ఓట్ల తేడాతో బిల్లుకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. మోడీ ఫస్ట్​ టర్మ్​ పాలనలో ఈ బిల్లుకు లోక్​సభలో రెండు సార్లు ఆమోదం లభించినప్పటికీ.. రాజ్యసభలో ఆమోదం లభించకపోవడంతో దీనిపై 2018 సెప్టెంబర్​లో కేంద్రం ఆర్డినెన్స్​ను తీసుకువచ్చింది. ఆర్డినెన్స్​కు గడువు ముగియనుండటంతో ఉభయ సభల ఆమోదం తప్పనిసరైంది. ఇప్పుడు రెండు సభల్లోనూ ఆమోదం లభించడంతో మోడీ సర్కార్​ విజయం సాధించినట్లయింది. ఇక బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపనున్నారు. ఆయన ఆమోదం తెలిపితే ఆర్డినెన్స్​ స్థానంలో చట్టం వస్తుంది.

క్రిమినల్​ నేరమే

ముస్లిం వర్గాల్లో అకారణంగా మూడు సార్లు తలాక్​ చెప్పి భార్యలకు భర్తలు విడాకులు ఇస్తున్నట్లు చాలా కాలం నుంచి మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ఎన్నో కేసులు సుప్రీం కోర్టు దృష్టికి వచ్చాయి.  2017లో స్పందించిన సుప్రీంకోర్టు.. ఇన్​స్టంట్​ ట్రిపుల్​ తలాక్​ రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది. చట్టం తేవాలని కేంద్రానికి సూచించింది. నోటి మాటగా.. టెక్స్ట్​ మెజేస్​ రూపంలో, ఈ మెయిల్​ రూపంలో భర్తలు మూడు సార్లు తలాక్​ అని చెప్పి భార్యలకు విడాకులు ఇస్తున్నారని, దీని వల్ల ముస్లిం మహిళలకు రక్షణ లేకుండాపోతోందని మహిళా సంఘాలు అంటున్నాయి. ఈ క్రమంలో కేంద్రం ‘ముస్లిం ఉమెన్​(ప్రొటెక్షన్​ ఆఫ్​ రైట్స్​ ఆన్​ మ్యారేజ్​) బిల్లు‌‌’ను రూపొందించింది.  బిల్లు ప్రకారం..  ట్రిపుల్​ తలాక్​ను క్రిమినల్​ నేరంగా పరిగణిస్తారు. దీన్ని ఉల్లంఘిస్తే భర్తలకు మూడేండ్ల జైలు శిక్ష విధించనున్నారు. భార్య ఫిర్యాదు మేరకు దీన్ని అమలు చేస్తారు.

దేశమంతా సంతోషిస్తోంది

ఎట్టకేలకు మధ్య యుగాల నాటి ప్రాక్టీస్ చెత్తబుట్ట పాలైంది. ముస్లిం మహిళల పట్ల జరిగిన చారిత్రక తప్పిదాన్ని ఈ రోజు పార్లమెంట్​సరిదిద్దింది. ఇది లింగ సమానత్వానికి, తద్వారా సమాజంలో సమానత్వం సాధించేందుకు మార్గం చూపుతుంది. ఈ విజయంతో దేశమంతా సంతోషిస్తోంది, బిల్లుకు మద్దతుగా ఓటేసిన ఎంపీలకు ధన్యవాదాలు.. దేశ చరిత్రలో ఈ నిర్ణయం ఎన్నటికీ గుర్తుండిపోతుంది.

– ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్

ముస్లిం కుటుంబాల నాశనమే బిల్లు ఉద్దేశం..

‘ట్రిపుల్​ తలాక్​ బిల్లు రాజకీయ ప్రేరేపితం. మైనారిటీలలో గొడవలు పెంచడం, ముస్లిం కుటుంబాలను నాశనం చేయడమే దీని అసలు ఉద్దేశం. భార్యభర్తలు కోర్టుల చుట్టూ తిరుగుతూ, ఉన్న ఒకటీ అరా ఆస్తులను అమ్ముకుంటారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. ఈ బిల్లును రాజ్యసభ సెలక్ట్​కమిటీకి పంపించాలి’

– గులాం నబీ ఆజాద్, రాజ్యసభలో కాంగ్రెస్​ పక్ష నేత