ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మంగళవారం అసెంబ్లీలో రూ.1,03,700 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీనిని ఆమె 'హరిత బడ్జెట్' గా పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో సామాన్యులకు వరాల జల్లు కురిపించడంతో పాటు నగరాభివృద్ధికి పెద్దపీట వేశారు. హోలీ, దీపావళి పండుగల సందర్భంగా ప్రతి ఇంటికి ఒకటి చొప్పున ఏడాదికి రెండు ఎల్‌పిజి (LPG) సిలిండర్లను ఉచితంగా ఇవ్వనున్నారు. దీని కోసం రూ.260 కోట్లు కేటాయించారు. మున్సిపల్ కార్పొరేషన్ (MCD) పాలన కోసం రూ.11,666 కోట్లు, ఢిల్లీ జల్ బోర్డుకు రూ.9,000 కోట్లు, చాంద్రవల్ నీటి ప్లాంట్ కోసం రూ.475 కోట్లు కేటాయిస్తూ, ఇకపై ప్రజలు ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదని సీఎం హామీ ఇచ్చారు.
నగరంలో 750 కిలోమీటర్ల మేర రోడ్లకు కొత్తగా తారు వేయడానికి రూ.1,352 కోట్లు, ప్రజా పనుల శాఖ (PWD)కు రూ.5,921 కోట్లు కేటాయించారు. ఫ్లైఓవర్ల విస్తరణ, కొత్త రోడ్ల కనెక్టివిటీకి ప్రాధాన్యతనిచ్చారు. కరెంటు తీగలు (ఓవర్‌హెడ్ వైర్లు) తొలగించి భూగర్భ కేబుల్స్ వేయడానికి రూ.200 కోట్లు సహా, విద్యుత్ శాఖకు మొత్తం రూ.3,942 కోట్లు కేటాయించారు. చిన్న చిన్న ఇరుకైన సందుల్లో మంటలను ఆర్పేందుకు వీలుగా అగ్నిమాపక వ్యవస్థను ఆధునీకరించడానికి రూ.674 కోట్లు కేటాయించారు.
వచ్చే ఏడాది పన్నుల ద్వారా రూ.74,000 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా.. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన ప్రాంతాల్లో ఢిల్లీ మూడవ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి గర్వంగా చెప్పారు. యమునా నది ఆవలి ప్రాంత అభివృద్ధికి రూ.300 కోట్లు, పారిశ్రామిక ప్రాంతాల మెరుగుదల కోసం రూ.160 కోట్లు, నజాఫ్‌గఢ్ డ్రెయిన్ (మురికికాలువ) ఆధునీకరణకు రూ.454 కోట్లు ఇచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, గత ప్రభుత్వాల హయాంలో 'ఉచితాల సంస్కృతి' వల్ల ఆదాయం తగ్గిందని, కానీ తమ ప్రభుత్వం అభివృద్ధికి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ బడ్జెట్ తయారీకి ముందు ట్రాన్స్‌జెండర్లు, గిగ్ వర్కర్లు, కార్మికుల సలహాలను కూడా తీసుకున్నట్లు ఆమె వివరించారు.
ALSO READ : కేంద్రం చేస్తున్న అన్యాయంపై పార్లమెంట్లో తెలుగులోనే కడిగిపారేసిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
మార్చి 23న ప్రారంభమైన ఢిల్లీ ప్రభుత్వ బడ్జెట్ సమావేశాలు బిజెపి ప్రభుత్వానికి రెండవ బడ్జెట్. " ప్రజల సూచనలకు అనుగుణంగానే ఈ బడ్జెట్ ఉండేలా సమాజంలోని వివిధ వర్గాల ప్రజలతో సంప్రదించాము. ఇది ప్రజల ఆందోళనలను పరిష్కరించి, ఢిల్లీకి మౌలిక సదుపాయాలను కల్పించాలి. అభివృద్ధి చెందిన ఢిల్లీ కోసం ఒక రోడ్‌మ్యాప్‌తో ప్రజలను చేరుకోవాలని మేము కోరుకుంటున్నాము. వారి భాగస్వామ్యమే ఈ బడ్జెట్‌కు అతిపెద్ద బలం" అని ముఖ్యమంత్రి అన్నారు.
