డబుల్ గోల్స్ తో సత్తా చాటిన రిచర్లిసన్

డబుల్ గోల్స్ తో సత్తా చాటిన రిచర్లిసన్

లుసైల్‌‌‌‌ (ఖతార్): ఫుట్‌‌బాల్‌‌లో బైస్కిల్‌‌ కిక్‌‌  గోల్‌‌కు స్పెషాలిటీ ఉంటుంది. అమాంతం గాల్లోకి ఎగిరి అలాంటి గోల్‌‌ కొట్టాలంటే టాలెంట్‌‌తో పాటు  టైమింగ్‌‌ కూడా కుదరాలి. ఈ తరం వాళ్లలో  పోర్చుగల్‌‌ సూపర్‌‌ స్టార్‌‌ రొనాల్డో ఇలాంటి గోల్స్‌‌ కొట్టడంలో దిట్ట. ఇప్పుడు బ్రెజిల్‌‌ యంగ్‌‌ సెన్సేషన్‌‌ రిచర్లిసన్‌‌.. రొనాల్డోని మరిపించాడు. అచ్చం రొనాల్డో మాదిరిగా బైస్కిల్‌‌ కిక్‌‌తో గోల్‌‌ కొట్టి ఫిఫా వరల్డ్‌‌ కప్‌‌లో నయా స్టార్‌‌ అయిపోయాడు. పది నిమిషాల వ్యవధిలో రిచర్లిసన్‌‌ రెండు ఖతర్నాక్ గోల్స్‌‌తో తడాఖా చూపెట్టడంతో  ఫిఫా వరల్డ్‌‌ కప్‌‌ను బ్రెజిల్ ఘన విజయంతో షురూ చూసింది. గ్రూప్‌‌–జిలో భాగంగా గురువారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌‌లో 2–0తో సెర్బియాను ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో ఫస్టాఫ్‌‌లో ఇరు జట్లూ గోల్స్ ఖాతా తెరవలేకపోయాయి.  బ్రెజిల్‌‌ ప్లేయర్లు టార్గెట్‌‌పై చేసిన దాడులను సెర్బియా గోల్‌‌ కీపర్‌‌ నిలువరించాడు.

అయితే, సెకండాఫ్ మొదలైన వెంటనే బ్రెజిల్‌‌ దూకుడు చూపెట్టింది. ఈ క్రమంలో  60వ నిమిషంలో శాండ్రో 30 గజాల దూరం నుంచి కొట్టిన షాట్‌‌ బార్‌‌కు తగిలి కొద్దిలో గోల్‌‌ మిస్సయింది. అయితే, రెండు నిమిషాల తర్వాత నేమార్‌‌ ప్రత్యర్థి డిఫెండర్లను ఏమార్చుతూ వారి బాక్స్‌‌లోకి చొచ్చుకొచ్చాడు. అతని నుంచి బాల్‌‌ తీసుకున్న వినిసియస్‌‌  లెఫ్ట్‌‌ సైడ్‌‌ నుంచి పవర్‌‌ ఫుల్‌‌ షాట్‌‌ కొట్టగా.. సెర్బియా కీపర్‌‌ సేవ్‌‌ చేశాడు. కానీ, అక్కడే పడ్డ బంతిని రిచర్లిసన్‌‌ చాకచక్యంగా నెట్‌‌లోకి పంపి బ్రెజిల్‌‌కు తొలి గోల్‌‌ అందించాడు. కాసేపటికే ఈ టోర్నీకే హైలైట్‌‌ అనిపించే రీతిలో అతను మరో గోల్‌‌ రాబట్టాడు. 73వ నిమిషంలో వినిసియస్‌‌ అందించిన క్రాస్‌‌ను బాక్స్‌‌లో ఎడమ కాలితో టచ్‌‌ చేసి పైకిలేపిన అతను అమాంతం గాల్లోకి ఎగిరి కుడికాలితో పవర్‌‌ ఫుల్‌‌  బైస్కిల్‌‌ కిక్‌‌తో నెట్‌‌లోకి పంపడంతో స్టేడియం హోరెత్తిపోయింది.  బ్రెజిల్ త‌‌ర‌‌పున ఆడిన గ‌‌త ఏడు మ్యాచుల్లో రిచ‌‌ర్లిస‌‌న్ మొత్తం 9 గోల్స్ చేయడం విశేషం. కాగా, ఈ మ్యాచ్‌‌లో నేమార్‌‌ ఏకంగా తొమ్మిది ఫౌల్స్‌‌ చేశాడు. ఈ వరల్డ్‌‌కప్​లో మరే ప్లేయర్‌‌ కూడా ఐదు కంటే ఎక్కువ ఫౌల్స్‌‌ చేయలేదు. మరోవైపు ముందు నుంచి నేమార్‌‌ను టార్గెట్‌‌ చేసిన సెర్బియా డిఫెండర్లు రిచర్లిసన్‌‌ ముప్పు పసిగట్టలేకపోయాడు. అతడిని అడ్డుకోలేక మ్యాచ్‌‌లో చిత్తయ్యారు.

నేమార్‌కు గాయం.. 

సెర్బియా ప్లేయర్ల చేతిలో చాలాసార్లు ట్యాకిల్‌కు గురైన నేమార్‌ గాయపడ్డాడు.80వ నిమిషంలో కుడి చీలమండ నొప్పితో విలవిల్లాడుతూ గ్రౌండ్‌ వీడాడు. బెంచ్‌పై కూర్చున్నప్పుడు ఏడుస్తూ కనిపించాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత మెడికల్‌ చెకప్స్‌ చేయించుకున్న అతను ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నాడు. నేమార్‌ కండరాల్లో చీలిక వచ్చిందని డాక్టర్లు చెప్పారు. దాంతో, సోమవారం స్విట్జర్లాండ్‌తో జరిగే బ్రెజిల్‌ రెండో మ్యాచ్‌కు అతను దూరం కానున్నాడు.

లేట్ గోల్స్‌‌‌‌తో రేసులోకి ఇరాన్‌‌

తొలి మ్యాచ్‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌ చేతిలో చిత్తయిన ఇరాన్‌‌‌‌ వెంటనే పుంజుకుంది.  రుజ్బె చెష్మి, రమిన్‌‌‌‌ రిజయెన్‌‌‌‌ ఎక్స్‌‌‌‌ట్రా టైమ్‌‌‌‌లో చేసిన లేట్‌‌‌‌ గోల్స్‌‌‌‌తో టోర్నీలో తొలి విజయం సొంతం చేసుకుంది. గ్రూప్‌‌‌‌–బి మ్యాచ్‌‌‌‌లో 2–0తో వేల్స్‌‌‌‌ జట్టును ఓడించి నాకౌట్‌‌‌‌ రేసులో నిలిచింది. నిర్ణీత 90 నిమిషాల్లో ఇరు జట్లూ ఖాతా తెరవకపోవడంతో మ్యాచ్‌‌‌‌ డ్రా ముగిసేలా కనిపించింది. కానీ, ఎక్స్‌‌‌‌ట్రా టైమ్‌‌‌‌ 8వ నిమిషంలో చెష్మి  ఔట్‌‌‌‌ సైడ్‌‌‌‌ బాక్స్‌‌‌‌ నుంచి గోల్‌‌‌‌ కొట్టగా.. 3 నిమిషాల తర్వాత రమిన కూడా స్కోరు చేశాడు. 

గ్రూప్​–ఎ లో భాగంగా నెదర్లాండ్స్​–ఈక్వెడార్​ మధ్య జరిగిన మరో మ్యాచ్ 1–1తో డ్రాగా ముగిసింది. నెదర్లాండ్స్​ తరఫున ఆరో నిమిషంలో గప్కో గోల్​ కొట్టగా, 49వ నిమిషంలో యినెర్ చేసిన గోల్​తో స్కోరు సమం అయింది.​