హైదరాబాద్​లో వారంలోనే 1120 డెంగీ కేసులు

హైదరాబాద్​లో వారంలోనే 1120 డెంగీ కేసులు

హైదరాబాద్, వెలుగు‘‘గ్రామాల్లో ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకుంటే హైదరాబాద్‌‌ ఆస్పత్రికి తీసుకుపోవాలంటారు. అదే హైదరాబాద్‌‌లో జనం విష జ్వరాలు, డెంగీ వంటి వాటితో బాధపడుతుంటే ఏమనాలో అర్థం కావడం లేదు” అని హైకోర్టు ఘాటుగా కామెంట్స్ చేసింది. గతేడాదితో పోలిస్తే డెంగీ కేసులు వంద శాతానికిపైగా పెరిగిపోయాయని వైద్య శాఖ నివేదికలు చెప్పడంపై విస్మయం వ్యక్తం చేసింది. ‘‘హైదరాబాద్‌‌లో గత వారం రోజుల్లో 1,120 కేసులు నమోదయ్యాయి. ఇవి కేవలం సర్కారీ దవాఖానాల్లో కేసులు మాత్రమే. ఇతర ప్రైవేట్‌‌ ఆస్పత్రుల్లోని రోగుల సమాచారం కూడా కలిపితే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. హైదరాబాద్‌‌ నగరంలోనే ఇలా ఉంటే రాష్ర్టవ్యాప్తంగా రోగాల పరిస్థితి ఎలా ఉందో?” అని డివిజన్‌‌ బెంచ్‌‌ వ్యాఖ్యానించింది. డెంగీ బాధితులకు వైద్యం అందడం లేదని వైద్యురాలు కరుణ, లాయర్‌‌ రాపోలు భాస్కర్‌‌ వేసిన పిల్స్‌‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ రాఘవేంద్రసింగ్‌‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌‌ అభిషేక్‌‌రెడ్డిలతో కూడిన బెంచ్‌‌ విచారించింది. ప్రభుత్వ రిపోర్టును చూసి ఘాటుగా స్పందించింది.

వైద్యానికి ఎంత ప్రాధాన్యమిస్తున్నారో అర్థమవుతోంది

ఎన్ని సూచనలు చేస్తున్నా అమలు చేయడంలేదని అధికారులను హైకోర్టు తప్పుబట్టింది. జనం రోగాలతో దవాఖాన్లకు వస్తుంటే ప్రభుత్వం మాత్రం సాధారణంగానే స్పందించడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేసింది. రోగులకు సరిపోయే సంఖ్యలో డాక్టర్లు, మెడికల్‌‌ స్టాఫ్, ఆస్పత్రుల్లో బెడ్స్‌‌ లేవంటే మనం వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అర్థం అవుతోందని కామెంట్స్ చేసింది. వచ్చే నాలుగు నెలల్లో తీసుకోబోయే చర్యలు, రాబోయే ఏడాదిలో ఇవి పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకునే చర్యల్ని నివేదించాలని సర్కార్‌‌ను ఆదేశించింది. అవసరమైతే పక్క రాష్ట్రాల నుంచి మెడికల్‌‌ టీమ్స్‌‌ను తెప్పించుకోవాలని స్పష్టం చేసింది. 2018లో సెప్టెంబర్‌‌ 7 నాటికి 1,549 కేసులు నమోదైతే ఇప్పుడు 3,526 కేసులు రికార్డయ్యాయని, పరిస్థితి ప్రమాదకరంగా మారకుండా చర్యలు తీసుకోవాలని బెంచ్‌‌ సూచించింది. అన్ని చర్యలు తీసుకుంటున్నామని, పూర్తి వివరాల అందజేసేందుకు గడువు ఇవ్వాలని ఏజీ బీఎస్‌‌ ప్రసాద్‌‌ కోరారు. కేంద్రం సూచనల్ని రాష్ట్రం అమలు చేయడంలో వెనుకబడిందని ఎమికస్‌‌ క్యూరీ, సీనియర్‌‌ లాయర్‌‌ నిరంజన్‌‌రెడ్డి చెప్పారు. సర్కారీ దవాఖానాల్లో బెడ్స్, ఐసీయూ యూనిట్స్, మెడికల్‌‌ స్టాఫ్‌‌ను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వాదనలు విన్న బెంచ్​విచారణను 20 వ తేదీకి వాయిదా వేసింది.