కువైట్ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. 37 వేల మంది పౌరసత్వం రద్దు.. ఇందులో 26 వేల మంది మహిళలే..!

కువైట్ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. 37 వేల మంది పౌరసత్వం రద్దు.. ఇందులో 26 వేల మంది మహిళలే..!

కువైట్ ప్రభుత్వం ఆగస్ట్ 2024 నుంచి 37 వేల మంది పౌరసత్వాన్ని తొలగించింది. దీంతో.. రాత్రికి రాత్రే వేల మంది కువైట్ దేశస్తులు కాకుండా అయిపోయారు. ఇందులో.. 26 వేల మంది మహిళలే ఉండటం గమనార్హం. ఇవి అధికారికంగా బయటికొచ్చిన లెక్కలు మాత్రమే. పౌరసత్వం కోల్పోయిన వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కువైట్ కొత్త ఎమిర్‌గా షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-సబా డిసెంబర్ 2023లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటిదాకా వేల మంది కువైట్ పౌరసత్వం కోల్పోయారు. 50 లక్షల మందికి పైగా ఉన్న కువైట్ జనాభాలో కేవలం మూడింట ఒక వంతు మాత్రమే నిజమైన కువైటీలు ఉన్నారని ఒక ప్రసంగంలో ఎమిర్ చెప్పారు. 

కువైట్‌ను శుభ్రం చేసి నిజమైన కువైట్ దేశస్తులకు అందజేస్తానని కువైట్ కొత్త ఎమిర్‌ చేసిన ప్రతిజ్ఞ ఫలితంగానే 26 వేల మందికి పైగా మహిళలు కువైట్ పౌరసత్వం కోల్పోయారు. ఇలా.. పౌరసత్వం కోల్పోయిన మహిళల్లో కువైట్ దేశానికి చెందిన పురుషులను వివాహం చేసుకున్న విదేశీ మహిళలే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. పౌరసత్వం కోల్పోయిన వారి వివరాలను ప్రతి వారం కువైట్ ప్రభుత్వం బహిరంగ జాబితాను విడుదల చేసి ప్రకటిస్తుండటంతో ఆ లిస్ట్లో తమ పేరు ఉందేమోనని కొందరు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ALSO READ | పాక్ టెర్రరిజం ఆపేదాకా సస్పెన్షన్‎లోనే సింధు ఒప్పందం: యూఎన్‎లో తేల్చిచెప్పిన భారత్

ద్వంద్వ పౌరసత్వానికి కువైట్లో అనుమతి లేదు. అందువల్ల.. కువైట్లో జీవించాలంటే కువైట్ ప్రభుత్వం జారీ చేసే ఒరిజినల్ సిటిజన్షిప్ తప్పనిసరి. కువైట్ పౌరసత్వం కోల్పోయిన వారికి ప్రభుత్వం అందించే వైద్య సేవలు గానీ, పిల్లలకు చెల్లించే స్కూల్ ఫీజులు గానీ, ల్యాండ్ కొనే అవకాశం గానీ, కంపెనీల్లో షేర్లు కొనేందుకు పర్మిషన్ గానీ ఉండదు. కొందరి డ్రైవింగ్ లైసెన్స్ లను కూడా కువైట్ ప్రభుత్వం రద్దు చేసింది. బ్యాంకు అకౌంట్లు పనిచేయకుండా ఆంక్షలు విధించింది.