పాక్ టెర్రరిజం ఆపేదాకా సస్పెన్షన్‎లోనే సింధు ఒప్పందం: యూఎన్‎లో తేల్చిచెప్పిన భారత్

పాక్ టెర్రరిజం ఆపేదాకా సస్పెన్షన్‎లోనే సింధు ఒప్పందం: యూఎన్‎లో తేల్చిచెప్పిన భారత్

న్యూఢిల్లీ: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్ చేసిన తప్పుడు ప్రచారాన్ని ఐక్యరాజ్యసమితి (యూఎన్)లో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీశ్ శనివారం ఖండించారు. అరవై ఐదేండ్లుగా కొనసాగుతున్న ఒప్పందాన్ని పహల్గాం ఉగ్రదాడి (26 మంది మరణించారు) తర్వాతే సస్పెండ్ చేశామని తెలిపారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ ప్రపంచ కేంద్రంగా ఉన్నదని.. టెర్రరిజానికి మద్దతును ఆపేవరకు సింధు జలాల ఒప్పందం అమల్లోకి రాదని హరీశ్ స్పష్టం చేశారు. గడిచిన 40 ఏండ్లల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడుల్లో 20 వేల మంది భారతీయులు చనిపోయారని ఆరోపించారు.

అంతకుముందు పాకిస్తాన్ రాయబారి ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ.."నీరు జీవనాధారం. యుద్ధ ఆయుధం కాదు" అని వ్యాఖ్యానించారు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేయడంపై విమర్శలు చేశారు. దీనికి పర్వతనేని హరీశ్ స్పందిస్తూ.. పాకిస్తాన్ చెప్పే మాయమాటలు, అసత్యాలు నిజాలను ఏమాత్రం మార్చలేవని, భారత్‎కు ఉన్న చట్టబద్ధమైన హక్కులను పాకిస్తానే అడ్డుకుంటున్నదని మండిపడ్డారు. ఈ సందర్భంగా నాలుగు కీలక అంశాలను ఆయన సభకు తెలియజేశారు.

 డ్యామ్‎లో మార్పులను అడ్డుకున్న పాక్​

మొదటిది.."భారత్, పాకిస్తాన్ మధ్య 1960లో సింధు జలాల ఒప్పందం జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ మూడు యుద్ధాలు, వేలాది ఉగ్రదాడులతో ఇరుదేశాల మధ్య ఉన్న ఒప్పందాలను ఉల్లంఘించింది. గత 40 ఏండ్లల్లో  20 వేల మంది భారతీయులు ఈ దాడుల్లో చనిపోయారు" అని హరీశ్ తెలిపారు. రెండోది.. ఉగ్రవాదం, ఇంధన అవసరాలు, వాతావరణ మార్పులు, జనాభా పెరుగుదల కారణంగా సింధు జలాల ఒప్పందంలో సవరణలు అవసరమని తెలిపామన్నారు. 

అయితే, డ్యామ్ మౌలిక సదుపాయాల్లో మార్పులను పాకిస్తాన్ అడ్డుకుంటున్నదని ఆయన ఆరోపించారు. మూడోది.. గత రెండేండ్లల్లో భారత్, ఒప్పంద సవరణలపై చర్చలకు పాకిస్తాన్‌‌ను కోరింది. కానీ, పాకిస్తాన్ తమ విజ్ఞప్తిని నిరాకరిస్తూ భారత హక్కులను అడ్డుకుంటున్న దని హరీశ్ తెలియజేశారు. నాలుగోది.. ఉగ్రవాదానికి పాకిస్తాన్ శాశ్వతంగా ముగింపు పలికే వరకు ఒప్పందం సస్పెండ్‌‌లోనే ఉంటుందని ఆయన స్పష్టంచేశారు.