పట్టాలెక్కిన బతుకు బండి..చాలా చోట్ల దుక్నాలు ఓపెన్

పట్టాలెక్కిన బతుకు బండి..చాలా చోట్ల దుక్నాలు ఓపెన్
  • ఇండ్లు విడిచి పనుల బాట పట్టిన జనం
  • నడిచిన ఆటోలు, ట్యాక్సీలు.. పలు సిటీల్లో ట్రాఫిక్​ జామ్​లు
  • లిక్కర్​ షాపుల వద్ద భారీ క్యూ లైన్లు.. సోషల్ డిస్టెన్స్​ బేఖాతర్​
  • కార్టన్ల కొద్దీ మందు కొనుక్కుపోయిన కస్టమర్లు

న్యూఢిల్లీదేశంలోని అనేక ప్రాంతాల్లో లాక్​డౌన్​ ఆంక్షల నడుమ బతుకుబండి పట్టాలెక్కింది. సుమారు నెలన్నర రోజుల నుంచి ఇండ్లకే పరిమితమైన జనం పనుల బాటపడుతున్నారు. కంటెయిన్​మెంట్​ ఏరియాల్లో తప్ప దాదాపు అన్ని జోన్లలో సోమవారం చిన్న చిన్న షాపులు మొదలు ఆఫీసుల వరకు ఓపెన్​ అయ్యాయి. ఒకవైపు కరోనా కట్టడికి లాక్​డౌన్​ను అమలు చేస్తూనే.. మరో వైపు ఎకానమీని గాడిలో పెట్టేందుకు జోన్ల వారీగా కేంద్రం ఇటీవల పెద్ద ఎత్తున సడలింపులను ఇచ్చింది. థర్డ్​ ఫేజ్​ లాక్​డౌన్​ ప్రారంభమైన సోమవారం నుంచే ఈ సడలింపులు అమలులోకి వచ్చాయి. వీటికి చాలా రాష్ట్రాలు ఓకే చెప్పడంతో కూలీలు, సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. గ్రీన్, ఆరెంజ్​ జోన్లతోపాటు రెడ్​ జోన్లలోనూ లిక్కర్​ షాపులు ఓపెన్​ కావడంతో మద్యం ప్రియులు ఫుల్​ జోష్​తో కనిపించారు. ఉదయమే షాపుల ముందు క్యూ కట్టారు. గ్రీన్​ జోన్లలో నెలన్నర కిందట ఉన్న వాతావరణమే కనిపించింది. దాదాపు అన్నిరకాల పనులు ఇక్కడ ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకే ఎసెన్షియల్​తోపాటు నాన్​ ఎసెన్షియల్​ షాపులను కూడా తెరిచారు. ఇండస్ట్రియల్​ యాక్టివిటీస్​, కన్​స్ట్రక్షన్​ వర్క్స్, ఈ కామర్స్​ సేవలు, కొరియర్​, పోస్టల్​ సర్వీసులు, బ్యాంకింగ్​ యాక్టివిటీస్​, అగ్రికల్చర్​ యాక్టివిటీస్​ కనిపించాయి. పనులకు వెళ్లే వాళ్లు మాస్కులు ధరిస్తూ.. సోషల్​ డిస్టెన్స్​ను పాటించడం కనిపించింది. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు మాత్రం కర్ఫ్యూ తరహా రూల్స్​ను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి.

ఢిల్లీ, కేరళ, ఒడిశా, తమిళనాడు, బెంగాల్​, ఏపీ, అరుణాచల్​ప్రదేశ్​, అస్సాం తదితర రాష్ట్రాల్లో  మెకానిక్​ షాపులు, మొబైల్​ షాపులు, ఎలక్ట్రికల్​ షాపులు, ఆప్టికల్స్​, స్టేషనరీ షాపులు, ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు, బ్యాంకులు తెరుచుకున్నాయి. గ్రీన్​, ఆరెంజ్​ జోన్లలో 50 శాతం స్టాఫ్​తో ఆఫీసులు, బ్యాంకులు కార్యకలాపాలు మొదలుపెట్టాయి. ఒడిశాలోని రెడ్​జోన్లలోనూ 33% కెపాసిటీతో ప్రైవేటు ఆఫీసులను ఓపెన్ చేశారు. ​కొన్ని వారాలుగా పెండింగ్‌‌‌‌లో ఉన్న ట్రాన్సాక్షన్స్​ను  పూర్తి చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు మేజర్​బ్యాంకుల వద్ద క్యూ కట్టారు. రెడ్​ జోన్లలో తప్ప గ్రీన్​, ఆరెంజ్​ జోన్లలో ట్యాక్సీలు, ఆటోలు నడిచాయి. జనం ఎక్కువగా సొంత వెహికల్స్​ను  ముఖ్యంగా బైక్​లపై బయటకు రావడం కనిపించింది.  ఢిల్లీ, ఈటానగర్​, బెంగళూరు, అహ్మదాబాద్​, కటక్​ వంటి సిటీల్లో ఉదయం పూట జనం ఒక్కసారిగా బయటకు రావడంతో  ట్రాఫిక్​ జామ్​లు ఏర్పడ్డాయి. కేంద్రం ఇచ్చిన గైడ్​లైన్స్​ ప్రకారం గ్రీన్​జోన్లలో 50శాతం కెపాసిటీతో బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. పలు రాష్ట్రాల్లో గ్రీన్​, ఆరెంజ్​ జోన్లలో  బార్బర్​ షాపులు కూడా ఓపెన్​ అయ్యాయి. అయితే కేరళలో మాత్రం బార్బర్​ షాపులను ఓపెన్​ చేయలేదు. గుజరాత్​లోనూ సడలింపులు అమలులోకి వచ్చాయి.