చిల్లర కుప్పలు...బియ్యం గుట్టలు

చిల్లర కుప్పలు...బియ్యం గుట్టలు

మేడారం హుండీల్లో భారీగా కాయిన్స్​, రైస్​ 
పైసలను జల్లెడ పడుతున్న సిబ్బంది
మొత్తం ఇన్​కం రూ.5 కోట్లకు పైనే.. 

వరంగల్‍, వెలుగు: మేడారం మహా జాతర హుండీల్లోని కానుకల లెక్కింపు కొనసాగుతోంది. హన్మకొండ టీటీడీ కల్యాణ మండపంలో కౌంటింగ్​ జరుగుతుండగా మూడు రోజుల్లోనే సగం కంటే ఎక్కువ హుండీల లెక్కింపు పూర్తయ్యింది. 497 హుండీల్లో ఇప్పటివరకు 249 హుండీలు తెరవగా రూ.5,38,59,100 ఆదాయం వచ్చింది. శుక్రవారం 68 హుండీలను కౌంట్ చేయగా రూ.1,53,37,100 వచ్చింది.  మొదటి రెండు రోజులు నోట్ల కట్టలకు సంబంధించి హుండీలు తెరిచి లెక్కపెట్టగా, శుక్రవారం ఒడి బియ్యం హుండీలు తెరిచారు. ఇందులో  భారీగా  కాయిన్స్​ బయటపడ్డాయి. బియ్యం, కాయిన్స్​ కలిసి వస్తుండడంతో వేరు చేయడానికి  జల్లెడ పట్టాల్సి వచ్చింది. సపరేట్‍ చేసిన కాయిన్స్​ను కుప్పలుగా పోస్తున్నారు. టన్నుల కొద్దీ వచ్చిన పసుపు బియ్యాన్ని సంచుల్లో నింపుతున్నారు. 
బెల్లం వేసిన్రు...కొబ్బరినీళ్లు పోసిన్రు...
హుండీల్లో డబ్బులతో పాటు పసుపు, కుంకుమలు కూడా వేయడంతో కరెన్సీకి కలర్​ అంటుకుంది. కొందరు హుండీలపై కొబ్బరికాయలు కొట్టడంతో ఆ నీళ్లు హుండీల్లో పడ్డాయి. మరికొందరు కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లను కూడా పోశారు. దీంతో చాలానోట్లు తడిచిపోయాయి. ఇంకా కొంతమంది బెల్లం వేయడంతో నోట్లు అతుక్కుపోయాయి. వీటిని శని, ఆదివారాల్లో సర్ఫ్​నీళ్లతో శుభ్రపరిచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.