థర్మాకోల్‌ తలుపులు.. మన ప్రభుత్వాలకే సాధ్యం

థర్మాకోల్‌ తలుపులు.. మన ప్రభుత్వాలకే సాధ్యం

కొంతమంది కాంట్రాక్టర్లు కమీషన్లకు కక్కుర్తి పడి అడ్డదారులు తొక్కుతున్నారు. నాణ్యమైన పనులు చేయకుండా లోపభూయిష్టంగా పనులు అలా కానిచ్చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి ముంబైలో వెలుగులోకి వచ్చింది.

మాల్వానిలోని అజామీనగర్ లో ఈ మధ్యే అధికారులు కొత్తగా మరుగుదొడ్లు నిర్మించారు. అయితే.. ఇవి నాణ్యతగా లేవని స్థానికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో స్థానికంగా ఉండే కాంగ్రెస్ నేత, మాజీ కార్పొరేటర్ వీరేంద్ర చౌదరి అజామీనగర్ కు వెళ్లారు.  

బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) పరిధిలో నాణ్యత లేకుండా మరుగుదొడ్లకు ఏర్పాటు చేసిన తలుపులను చూసి షాక్ అయ్యారు. మరుగుదొడ్లకు నిర్మించిన డోర్స్ ను చూసి ఖంగుతిన్నారు. నాణత్య లేకుండా డోర్స్ ఏర్పాటు చేశారని మండిపడ్డారు. బాత్రూమ్ డోర్స్ ను ప్రజలకు చూపిస్తూ.. వాటిని ధ్వంసం చేశారు.

ధర్మకోల్ తో తయారు చేసిన డోర్స్ ను వాడారంటూ మాజీ కార్పొరేటర్ వీరేంద్ర చౌదరి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్లకు కక్కుర్తి పడ్డ కాంట్రాక్టర్లు పనులు ఇలాగేనా చేసేది అంటూ ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోపై నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అధికారుల తీరును తప్పుపడుతున్నారు. మరొకొందరు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు వీరేంద్ర చౌదరిపై కేసులు నమోదు చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.