ఆత్మరక్షణ కోసమే క్యాబ్ డ్రైవర్‌‌ను కొట్టా.. లక్నో మహిళ

ఆత్మరక్షణ కోసమే క్యాబ్ డ్రైవర్‌‌ను కొట్టా.. లక్నో మహిళ

లక్నో: నడి రోడ్డుపై బిజీ ట్రాఫిక్​ మధ్యన ఓ క్యాబ్ డ్రైవర్​ను ఆపకుండా 22 సార్లు చెంప దెబ్బలు కొట్టిన మహిళ వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. తనను అతడి క్యాబ్​తో ఢీకొట్టబోతే ఈ పని చేసినట్లు చెబుతోంది యూపీలోని లక్నోకు చెందిన ప్రియదర్శిని నారాయణ్ యాదవ్. ఆ సమయంలో క్యాబ్ డ్రైవర్ సాదత్ అలీ సిద్ధిఖీ తనను తొక్కించేసి వెళ్లుంటే ఎవరు బాధ్యత వహించే వాళ్లని ఆమె ప్రశ్నిస్తోంది. అయితే శుక్రవారం నాడు ఈ ఘటన జరిగిన తర్వాత ఇద్దరు పరస్పరం పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే సాదత్‌ను అరెస్టు చేసిన పోలీసులు ప్రియదర్శిని యాదవ్‌ను ఇంకా అరెస్ట్ చేయకపోవడంపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతుండడంతో దీనిపై ఆమె స్పందించింది. ‘‘ఆ సమయంలో అతడు తన క్యాబ్​తో డ్యాష్​ కొట్టి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. అడ్డుకుని ప్రశ్నిస్తే తనపైనే దాడికి యత్నించాడు. అక్కడున్న వాళ్లెవరూ రెస్పాండ్ కాలేదు. పోలీసులు స్పందించి ఉంటే నేను అతడిని కొట్టాల్సి వచ్చేది కాదు. నన్ను నేను కాపాడుకోవడం కూడా తప్పేనా? నా జీవితం అంత చీప్​గా కనిపిస్తోందా? పోలీసులు అంతా అయిపోయాక పోస్ట్​మార్టం చేసి డెడ్​బాడీని ఇంటికి పంపుతారు. ఇక్కడ నష్టపోయేదెవరు?”అని ప్రియదర్శిని అడుగుతోంది.
శుక్రవారం ఆ ఘటన జరిగిన తర్వాత సాదత్​ను పోలీసులు అరెస్ట్ చేసి 28 గంటల పాటు స్టేషన్​లో ఉంచారు. అయితే తనను వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు ఆ మహిళను ఎందుకు అరెస్ట్ చేయాలేదని సాదత్ ప్రశ్నిస్తున్నాడు. స్టేషన్​లో ఉన్న సమయంలో తనను కలిసేందుకు వచ్చిన తమ్ముడిని కూడా పోలీసులు లోపలేశారని అతడు చెబుతున్నాడు. ఆమె తన ఫోన్ పగలకొట్టిందని, రూ.25 వేలు చేసే ఆ ఫోన్​ తన ఓనర్ ఇచ్చాడని, తానొక నిరుపేదనని, ఇప్పుడు ఆ ఫోన్​కు డబ్బులు ఎవరు కడుతారని సాదత్ ప్రశ్నిస్తున్నాడు.  ఆమె తనను కొడుతూ జేబులో ఉన్న రూ.600 డబ్బులు కూడా లాక్కుందని, కారు సైడ్ మిర్రర్స్ రెండు విరగ్గొట్టిందని చెబుతున్నారు. తనను వెంటనే అరెస్ట్ చేసినట్టు ఆమెను ఎందుకు అరెస్ట్ చేయరని సాదత్ నిలదీస్తున్నాడు. అయితే గతంలో తాను చాలా అటాక్స్ ఫేస్ చేశానని, పోలీసులకు కూడా ఈ విషయం తెలుసని ప్రియదర్శిని చెబుతోంది. వాళ్ల దగ్గర తన ఫోన్​ నంబర్, ఇంటి అడ్రస్ కూడా ఉన్నాయని, ఇంటికి పదే పదే వచ్చి హింసిస్తున్నారంటూ ఆమె పోలీసులపై ఆరోపణలు చేస్తోంది. 
శుక్రవారం జరిగిన సంఘటన సీసీటీవీ ఫుటేజ్​ గమనిస్తే ఆ మహిళనే వెహికల్స్ వెళ్తుండగా అడ్డదిడ్డంగా మధ్యలో నుంచి రోడ్డు దాటే ప్రయత్నం చేసినట్టుగా ఉందని పోలీసుల ద్వారా తెలుస్తోంది. అయితే ఆ సమయంలో కనిపించిన వెహికల్స్​లో చాలా వరకు రెడ్ సిగ్నల్ జంప్​ చేసి వచ్చినవేనని అంటున్నారు.