సింగరేణిలో పెరుగుతున్న ప్రమాదాలు..10 నెలల్లో 12మంది దుర్మరణం

సింగరేణిలో పెరుగుతున్న ప్రమాదాలు..10 నెలల్లో 12మంది దుర్మరణం
  •     ‌‌సింగరేణిలో పెరుగుతున్న ప్రమాదాలు
  •     పది నెలల్లో 12 మంది దుర్మరణం
  •     ‌‌సింగరేణిలో పెరుగుతున్న ప్రమాదాలు
  •     పది నెలల్లో 12 మంది దుర్మరణం

మందమర్రి, వెలుగు: సింగరేణిలో ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. వరుస ప్రమాదాలు కార్మికుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. గత పది నెలల్లో ఏకంగా 12 మంది కార్మికులు ప్రమాదాల్లో మృతిచెందారు. 166 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రక్షణ చర్యలు పటిష్టంగా చేపడుతున్నామని సింగరేణి యాజమాన్యం చెబుతున్నప్పటికీ ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. తాజాగా రామగుండం -2 ఏరియాలోని వకీల్​పల్లె గనిలో పైకప్పు కూలి సేఫ్టీ డ్యూటీలో కీలకంగా వ్యవహరించే ఓవర్​మెన్ రాకం నవీన్​ మృత్యువాత పడటం, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ప్రమాదం కార్మికుల్లో అలజడి రేపుతోంది.  గనిలో అత్యంత సురక్షితంగా ఉండాల్సిన జంక్షన్​ కూలిపోవడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. సింగరేణిలో ప్రమాదాలు జరగకుండా రెండు, మూడు నెలలకోసారి కార్మికులు, ఆఫీసర్ల మధ్య రక్షణ ద్విసభ్య కమిటీ మీటింగ్​ఏర్పాటు చేయాల్సి ఉన్నా అమలులో నిర్లక్ష్యం చూపుతున్నారు. తూతూ మంత్రంగా నిర్వహిస్తూ చేతులు దులుపుకొంటున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణం

సింగరేణిలో పెరుగుతున్న ప్రమాదాలకు యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమనే ఆరోపణలున్నాయి. 2019 సంవత్సరంలో 8 మంది కార్మికులు మృతిచెందగా ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్​31 వరకు 12 మంది కార్మికులు మృతిచెందారు. ప్రమాదాలను నియంత్రించేందుకు రక్షణ చర్యలు తీసుకుంటున్నామని యాజమాన్యం చెబుతున్నప్పటికి వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.  కార్మికులు మృత్యువాత పటడం రక్షణ నిర్లక్ష్యాన్ని చూపుతోంది. గనుల్లో రూఫ్, సైడ్​వాల్ కూలిన  ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు కార్మికులు పేర్కొంటున్నారు. ఓసీపీల్లో కాంట్రాక్టు కార్మికులకు సరైన శిక్షణ లేకపోవడంతో డోజర్లు, డంపర్ల కిందపడి చనిపోతున్న ఘటనలున్నాయి. అండర్ గ్రౌండ్​గనుల్లో కాకుండా సర్ఫేస్, ఎలక్ర్టికల్​ ప్రమాదాలు జరిగి కార్మికులు మృతిచెందుతున్నారు. రక్షణ పరికరాలు సక్రమంగా అందుబాటులో ఉండకపోవడం, కొత్తగా వచ్చే ఆఫీసర్లు సీనియర్​కార్మికుల సూచనలు పాటించకపోవడం, మైనింగ్​ సూపర్​వైజర్​సిబ్బంది కొరత, అధిక పనిభారం వంటి ప్రధాన సమస్యలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. హంగు ఆర్భాటాలతో సింగరేణి వ్యాప్తంగా 52వ రక్షణ వారోత్సవాలను ప్రారంభించిన తొలిరోజే శ్రీరాంపూర్​ఏరియా ఆర్కే 6 గనిలో ఓ కార్మికుడి నిండుప్రాణం గాలిలో కలిసింది. గత ఆరేళ్లలో 52  మంది కార్మికులు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయ్యారు.

ప్రమాదాలు జరుగుతున్నా జాగ్రత్తలు కరువు

రెండేళ్ల కిందట మందమర్రి ఏరియా బెల్లంపల్లిలోని శాంతిఖని గనిలో జంక్షన్​పైకప్పు కూలి ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఆ ప్రమాదం తర్వాత కూడా యాజమాన్యం రక్షణ చర్యల్లో నిర్లక్ష్యం వీడలేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు పేలుళ్ల ప్రమాదాలు కూడా అందరినీ కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది జూన్​ మొదటివారంలో రామగుండం రీజియన్​ ఓసీపీ1 గనిలో పేలుడు జరిగి బండ అంజయ్య, బిల్ల రాజేశం, బండారి ప్రవీన్​కుమార్​, బెల్కెవార్​ రాకేశ్​ అనే కాంట్రాక్టు కార్మికులు మృతిచెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. సెప్టెంబర్​ 2న శ్రీరాంపూర్​ ఏరియాలోని ఆర్కే5బి బొగ్గు గనిలో మిస్​ఫైర్ ప్రమాదంలో  రత్నం లింగయ్య అనే కోల్​కట్టర్​కార్మికుడు మృతిచెందగా మరో నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ రెండు ఘటనల్లోనూ డిటోనేటర్లు అమరుస్తున్న క్రమంలోనే పేలుళ్లు జరిగాయి. ఆఫీసర్ల పర్యవేక్షణ లోపమే ప్రమాదాలకు కారణమని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. గనులు, డిపార్ట్​మెంట్ల నిర్వహణ లోపం కూడా కనిపిస్తోంది.  అక్టోబర్​లో ఆర్జీ3 ఏరియాలోని ఓసీపీ1 సీహెచ్ పీ బంకరు కూలిన ఘటన ఇందుకు నిదర్శనం.