- ప్రజావాణిలో కలెక్టర్లు
ఆదిలాబాద్‌టౌన్/మంచిర్యాల/ఆసిఫాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎలక్షన్ కోడ్ కారణంగా తాత్కాలికంగా ఆగిన ప్రజావాణి సోమవారం పున:ప్రారంభమైంది. ఆదిలాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్రాజర్షి షా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. దరఖాస్తులను అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. వివిధ మండలాల నుంచి 110 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.
మండల ప్రత్యేక అధికారులు తమ మండలాల్లోని పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా నిరంతరం విద్యా సంస్థలను పర్యవేక్షించాలని, ఆ నివేదికలను ప్రతివారం సమర్పించాలని ఆదేశించారు. అనంతరం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాల ఫ్లెక్సీని ఆవిష్కరించారు. అడిషనల్కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, డీఆర్‌డీవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. నస్పూర్‌లోని కలెక్టరేట్లో అధికారులతో కలిసి ఆర్జీలు స్వీకరించారు. పోచంపాడు శివారులోని హద్దుల సమస్యలను విచారించి పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. భర్త చనిపోయాడని, మరణ ధ్రువీకరణ పత్రం ఇప్పించాలని, తాను కొనుగోలు చేసిన భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, ఒంటరి మహిళ పింఛన్ ఇప్పించాలని దరఖాస్తులు అందాయి.
విచారణ జరిపించి న్యాయం చేయాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆసిఫాబాద్అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ ఆదేశించారు. కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ డేవిడ్‌తో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వితంతు పెన్షన్ ఇప్పించాలని, ఓపెన్ కాస్ట్ నిర్వాసితుల జాబితాలో తన పేరు లేదని.. విచారణ జరిపించి న్యాయం చేయాలని, పాస్ పుస్తకం మంజూరు చేయాలని, భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయిందని నష్టపరిహారం మంజూరు చేయాలని, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించా లని, పట్టా మార్పిడి చేయాలని కోరుతూ దరఖాస్తులు అందజేశారు.
