02 ఫిబ్రవరి 2024 రోజున సర్పంచుల పదవీకాలం ముగిసి, స్పెషల్ ఆఫీసర్ల పాలనలో సుమారు 16 నెలల తర్వాత 22 డిసెంబర్ రోజున కొత్త పాలకవర్గం కొలువుదీరింది. పంచాయతీ ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు అంటూ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించక పోవడం వల్ల పంచాయతీలకు నిధుల దారులు మూసుకుపోయాయి.
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2011 జనాభా లెక్కల ప్రకారం ఆయా రాష్ట్రాల స్థానిక సంస్థలు (గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు) లకు నిధులు కేటాయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల 15 వ ఆర్థిక సంఘం 2024 - 25 సంవత్సరం 1500 కోట్లు, 2025 –- 26 సంవత్సరం 1500 కోట్లు మొత్తంగా 3000 కోట్ల నిధులు విడుదల కాలేదు. ఎన్నికలు నిర్వహించడం వల్ల 31 మార్చి 2026 లోపు ఈ నిధులు విడుదల అయ్యే అవకాశం ఉన్నది. వీటి కోసం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక బ్యాంకు అకౌంట్ తెరవాలని ఆదేశాలు ఇచ్చారు.
స్టేట్ ఫైనాన్స్ నిధులు
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంఘం సిఫార్సుల లాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల అభివృద్ధికి రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల ద్వారా నిధులు మంజూరు చేస్తుంది. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో అక్కడక్కడ అరకొర నిధులు ఇవ్వడం తప్ప రెండేళ్లుగా ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు.
ఎంపీ ల్యాడ్స్ నిధులు
మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ కింద ప్రతీ పార్లమెంట్ సభ్యునికి తన నియోజకవర్గంలోని గ్రామాలకు సంవత్సరానికి రూ.5 కోట్ల నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేసే అవకాశం ఈ పథకం కింద ఉంటుంది. రాష్ట్రం నుంచి రెండు జాతీయ పార్టీల తరపున పదహారు మంది ఎంపీలు ఉన్నా ఒకరిద్దరు తప్ప ఎవరూ కూడా పెద్దగా నిధులు తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేసింది లేదు.
‘సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన’ లాంటి పథకాలు అటకెక్కాయి. ఎంపీలకు రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ కేంద్రం నుంచి నిధులు తేవడం మీద లేదు! ఈ నిధులు ఖర్చు చేసినట్టు ఎన్ఓసి సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిధుల వివరాల్లోకి వెళ్తే ఖర్చు చేయకుండా.. ఖర్చు చేసిన నిధులకు ఎన్ఓసిలు సమర్పించకుండా ఉన్నవే ఎక్కువగా ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఎమ్మెల్యే లాడ్స్ నిధులు
మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్స్ కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఎమ్మెల్యేకు సొంత నియోజకవర్గ అభివృద్ధి కింద ప్రతీ బడ్జెట్లో నిధులు కేటాయిస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండు ఆర్థిక బడ్జెట్ లు ముగిసినా ఏ ఒక్క ఎమ్మెల్యేకు నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. స్వయాన అధికార పార్టీ ఎమ్మెల్యేలే గ్రామాల్లో తిరగలేకపోతున్నాం, కేవలం పెళ్లిళ్ళ, అంతిమ కార్యక్రమాలకు తప్ప నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేయలేకపోతున్నాం అనే వ్యాఖ్యలు చూసాం.
కో ఆప్టెడ్ మెంబెర్స్
తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో గ్రామ అభివృద్ధి కోసం పాలకవర్గంతో పాటు రాజకీయాలకు అతీతంగా ముగ్గురు సభ్యులను ఎన్నుకోవాలి. అందులో ఒకరు గ్రామ అభివృద్ధిపై కోరిక ఉన్న రిటైర్డు ఉద్యోగి లేదా సీనియర్ సిటిజన్, ఒకరు గ్రామ సంస్థ అధ్యక్షులు, ఇంకొకరు విరాళాలు ఇచ్చే దాతను ఎన్నుకోవాలి. కానీ ఓటు బ్యాంకు రాజకీయాల ఒప్పంద ముసుగులో ఏ లక్ష్యంతో ఈ సభ్యులను ఎన్నుకోవాలి అని చట్టంలో పొందు పరచారో అది నెరవేరడం లేదు.
గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ది చెందినట్టు కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా పంచాయతీలకు నిధుల కేటాయింపు చేయాలి. ప్రజా ప్రతినిధులు నిధులు ఖర్చుచేసి ఎన్ఓసీలు సమర్పించాలి. కింది స్థాయిలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా అధికారులు పంచాయతీ పాలకవర్గం పని చేయాలి.
సర్పంచుల పెండింగ్ బిల్లులు
కొందరు సర్పంచులు గ్రామ అభివృద్ధి కోసం అప్పులు చేసి వడ్డీలు కడుతూ నిధులు తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తే సకాలంలో ప్రభుత్వం వారి బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు చేసుకున్నవారు కొందరు ఐతే.. బిల్లుల కోసం తెలంగాణ సెక్రటేరియట్ వరకూ ధర్నాలు చేస్తున్నవారు ఇంకొందరు. ప్రభుత్వం ఇప్పటికైనా పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు కాకుండా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి.
సాధారణ నిధులు
ప్రతీ గ్రామ పంచాయతీలో జనరల్ ఫండ్ సాధారణ నిధుల కోసం ప్రత్యేక బ్యాంకు అకౌంట్ తెరిచి ఉన్నది. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వాటిద్వారా వచ్చే ఆదాయ వనరులు ఇంటి పన్ను, ఇసుక మట్టి సరఫరా, రియల్ ఎస్టేట్ లేఅవుట్లు, మొబైల్ టవర్స్, విరాళాలు, మొదలగునవి పంచాయతీకి వచ్చే సాధారణ ఆదాయ నిధులు.
కానీ ఎన్నికలలో లక్షలు ఖర్చు పెట్టి కొనుక్కున్న సర్పంచ్ కుర్చీ కనుక ఎక్కడో ఒక దగ్గర నిజాయితీ లోపించి ధర్మ హుండీ లాంటి గ్రామ పంచాయితీ గల్లాలో కాకుండా సర్పంచుల గల్ల నిండి ఆదాయానికి గండి పడుతుంది. నిజాయితీగా నడవాల్సిన పంచాయతీ కార్యదర్శులు సర్పంచుల అధికార అవినీతికి బలౌతున్నారు.
బందెల సురేందర్ రెడ్డి, మాజీ సైనికుడు
