సీఎం టైమ్ ​ఇస్తే విద్యుత్​ స్కామ్​పై వివరాలిస్త : కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి

సీఎం టైమ్ ​ఇస్తే విద్యుత్​ స్కామ్​పై వివరాలిస్త : కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి
  • సీఎం టైమ్ ​ఇస్తే విద్యుత్​ స్కామ్​పై వివరాలిస్త
  • అటెండర్ పేరిట రూ.2 కోట్ల స్కామ్​ జరిగింది
  • కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

కామారెడ్డి, వెలుగు : రాష్ట్రంలో రూ. 80 వేల కోట్ల విద్యుత్​ స్కామ్​పై చర్చ జరుగుతోందని, ఆ​ శాఖలోనే  అటెండర్​ పేరిట రూ.2 కోట్ల మేర స్కామ్​ జరిగిందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. తనకు సీఎం రేవంత్​ రెడ్డి టైమ్​ ఇస్తే, స్కామ్ కు సంబంధించి పూర్తి వివరాలు నేరుగా అందిస్తానన్నారు. లేకుంటే అసెంబ్లీలో ప్రస్తావించి, పత్రికాముఖంగా వివరిస్తానని చెప్పారు. ఆదివారం కామారెడ్డిలోని బీజేపీ ఆఫీసులో  మీడియా సమావేశంలో రమణా రెడ్డి మాట్లాడారు. గతంలో కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో ఉచిత విద్యుత్​ కోసం 14 పీపీఏలు (ఫవర్​ పర్చేస్​అగ్రిమెంట్లు) జరిగాయన్నారు. 

అప్పుడు విద్యుత్​ శాఖ మంత్రిగా షబ్బీర్​అలీ ఉన్నారని ఆయన గుర్తుచేశారు. నాయక్​ అనే విద్యుత్​ శాఖ ఉద్యోగి.. షబ్బీర్​ అలీ ఇంట్లో 18 ఏండ్లుగా పనిచేస్తున్నాడని, అలాగే మైనారిటీ శాఖకు చెందిన షాబాజ్​అనే మరో ఉద్యోగి 15 ఏండ్లుగా ఆయన ఇంట్లో పనిచేస్తున్నారని చెప్పారు. ఏడుసార్లు ఓడిన వ్యక్తి వద్ద ఏ హోదాలో ఇద్దరు మనుషులకు పనిచేసే అవకాశం ఇచ్చారని రమణారెడ్డి ప్రశ్నించారు. వారికి ప్రతినెలా రూ.లక్షల్లో జీతం ఉందని, ఈ లెక్కన రూ.2 కోట్లపైనే ప్రజాధనం వృథా అయిందని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు షబ్బీర్​ అలీ మంత్రిపదవి కోసం సీఎం రేవంత్​ రెడ్డి చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ప్రజారంజక పాలన అందిస్తానని చెబుతున్న రేవంత్​రెడ్డి.. ఈ విషయమై ఆలోచించాలని ఆయన కోరారు.