
తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ ముగిసింది. అన్ని నియోజక వర్గాల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కాగా.. పెద్ద సంఖ్యలోనే నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అన్ని సెగ్మెంట్లలో కలిపి 4 వేల 798 మంది నామినేషన్లు వేయగా 606 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. పరిశీలన తర్వాత ఎన్నికల బరిలో 2 వేల 898 మంది అభ్యర్థులు ఉండనున్నారు. నవంబర్ 3న ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే.
నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ల కార్యక్రమం కొనసాగింది. 4 వేల 798 మంది అభ్యర్థులు 5 వేల 716 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం (నవంబర్ 13) నుంచి నామినేషన్ల పరిశీలన కొనసాగింది. అత్యధికంగా గజ్వేల్‌లో 114 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆ తర్వాత మేడ్చల్‌లో 67, కామారెడ్డిలో 58, ఎల్బీనగర్‌లో 50, కొడంగల్‌లో 15 మంది, బాల్కొండలో 9 బరిలో ఉండగా.. అత్యల్పంగా నారాయణపేటలో 7 మంది అభ్యర్థులు పోటీలో ఉండననున్నారు.
గజ్వేల్ బరిలో అత్యధికంగా 114 మంది బరిలో ఉన్నారు. ఇక్కడి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి నెలకొంది. అందులో రెండు నియోజక వర్గాల్లో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ. అందులో ఒకటి గజ్వేల్. గులాబీ జెండాకు తామే ఓనర్లమని ఒకప్పుడు ప్రకటించిన ఈటల రాజేందర్ ఇప్పుడు అదే గులాబీ పార్టీ అధినేత కేసీఆర్‌పై పోటీకి దిగుతున్నారు.
నవంబర్15వ తేదీ బుధవారం వరకు నామినేషన్లు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. 15వ తేదీ సాయంత్రానికి ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల సంఖ్యపై మరింత క్లారిటీ రానుంది. తిరస్కరణకు గురైన నామినేషన్లలో బీఎస్పీ అభ్యర్థులు 8 మంది ఉన్నారు.
* మొత్తం తిరస్కరణకు గురైన నామినేషన్ల సంఖ్య 606
* నామిమేషన్ల పరిశీలన తరువాత ఆమోదించినవి 2898
* గజ్వేల్ లో అత్యధికంగా ఆమోదం పొందినవి 114
* మేడ్చల్ లో ఆమోదం పొందినవి 67