41 లక్షల 73 వేల ఎకరాల్లో వరి సాగు.. కోటి ఎకరాలు దాటిన పంటల విస్తీర్ణం

41 లక్షల 73 వేల ఎకరాల్లో వరి సాగు.. కోటి ఎకరాలు దాటిన పంటల విస్తీర్ణం
  • రాష్ట్రంలో మొత్తం 1.01కోట్ల ఎకరాల్లో పంటలు
  • 44.57 లక్షల ఎకరాల్లో పత్తి సాగు.. నిరుడు కన్నా తక్కువే  
  • ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక 

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌ లో పంటల సాగు కోటి ఎకరాలు దాటింది. సీజన్‌ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగు పడిపోతుందని భావించారు. కానీ గత నెలలో కురిసిన భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. అప్పటివరకు నామమాత్రంగా కొనసాగిన వరి నాట్లు వర్షాల తర్వాత ఊపందుకున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,01,72,383 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఈ వానాకాలం సీజన్​కు సాధారణ సాగు 1,24,28,723 ఎకరాలు కాగా.. బుధవారం నాటికి సాధారణ సాగు లక్ష్యంలో 81.85 శాతం సాగు జరిగినట్లు వ్యవసాయ శాఖ సర్కారుకు నివేదిక అందజేసింది. ఈ నివేదిక ప్రకారం.. గత ఏడాది ఇదే సమయానికి 94,93,000 ఎకరాల్లో సాగు కాగా, ఈ సారి 6.77 లక్షల ఎకరాలు అధికంగా సాగయ్యాయి.  

41.73 లక్షల ఎకరాల్లో వరి 

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రైతులు 41.73 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారు. సీజన్ లో వరి సాధారణ సాగు 49.86 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 41.73 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. సాధారణ సాగులో 83.70 శాతం సాగు జరిగింది. అయితే, అన్నింటికంటే అత్యధికంగా సాగైన ప్రధాన పంట పత్తి. ఇప్పటివరకు 44.57 లక్షల ఎకరాల్లో వేశారు. అయినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే దాదాపు 3.62 లక్షల ఎకరాల్లో తక్కువగానే పత్తి సాగు జరిగింది. అయితే కాటన్‌ సాగు లక్ష్యం 70 లక్షల ఎకరాలుగా నిర్ణయించారు. ఈ యేడు అధిక వర్షాలతో ఎఫెక్ట్‌ పడటంతో కంది సాగు విస్తీర్ణం 4.56 లక్షల ఎకరాలకు పరిమితమైంది. నిరుడు ఇదే సమయానికి 5.45 లక్షల ఎకరాల్లో కంది సాగు అయింది. సాధారణ సాగులో 59 శాతమే కంది సాగైంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,06,853 ఎకరాల్లో మక్కల సాగు జరిగింది. 

నల్గొండ టాప్‌ 

ఈ సీజన్ లో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 8.80 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఆ తర్వాత సంగారెడ్డిలో 6.64 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. కామారెడ్డిలో 4.66 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. అతితక్కువగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 13,133 ఎకరాల్లో మాత్రమే సాగు నమోదైంది. 

4 జిల్లాల్లో 100% దాటింది    

వానాకాలం సాధారణ సాగులో నాలుగు జిల్లాలు మినహా మిగతా 28 జిల్లాల్లో పంటల సాగు వంద శాతానికి చేరలేదు. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో మాత్రమే పంటల సాగు టార్గెట్ మేరకు వంద శాతానికిపైగా నమోదైంది.