లోతట్టు ప్రాంతాల్లో మంత్రి గంగుల పర్యటన

లోతట్టు ప్రాంతాల్లో మంత్రి గంగుల పర్యటన
  • వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం
  • అధికార యంత్రాంగం ఫీల్డ్లోనే ఉంది
  • మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్: భారీ వర్షాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. వరద పరిస్థితిని తెలుసుకుని అప్రమత్తంగా ఉన్నామని.. అధికార యంత్రాంగం అంతా జనంలోనే ఉన్నారని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జిల్లాలో జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో మంత్రి గంగుల కమలాకర్ పర్యటించారు. మేయర్ సునీల్ తదితరులను వెంట రాగా లోతట్టు ప్రాంతాలు.. వరద ముంచెత్తే అవకాశం ఉన్న ప్రాంతాలను పరిశీలించారు.

భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తుండడంతో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం అంతా ప్రజలకు అందుబాటులో ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అంతా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నారని ఆయన చెప్పారు. భారీ వర్షాలు, వరదల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. వర్షాల బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఎంత పెద్ద విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి గంగుల కమలాకర్ వివరించారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితి తెలుసుకుని అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు.