111 జీవోపై లీకులతో భూములు ముందే కొన్నరు

111 జీవోపై లీకులతో భూములు ముందే కొన్నరు

111 జీవోపై లీకులతో భూములు ముందే కొన్నరు
20 నెలల్లో చేతులు మారిన 11,800 ఎకరాలు
111 జీవో రద్దు గురించి ముందుగానే కొందరికి సమాచారం
లీడర్ల భూములన్నీ ప్రైమ్ లొకేషన్లలోనే
ఆర్ఆర్ఆర్, ఎయిర్‌‌‌‌పోర్టు మెట్రో రూట్లలో వేల ఎకరాల కొనుగోళ్లు
అప్పుడు అగ్గువకే.. ఇప్పుడు రియల్ బూమ్​తో పది రెట్ల విలువ

హైదరాబాద్, వెలుగు : 111 జీవో విషయంలో రాష్ట్ర సర్కార్ తీసుకునే నిర్ణయం గురించి రెండేండ్ల కిందటనే కొందరికి తెలియడంతో ప్రైమ్ ఏరియాల్లోని వేల ఎకరాలను ముందే కొన్నారు. గత 20 నెలల కాలంలో 84 గ్రామాల పరిధిలో జరిగిన భూముల కొనుగోళ్లు, అమ్మకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ స్థాయిలో భూములు చేతులు మారాయి. ఏకంగా 11,800 ఎకరాలు రైతుల నుంచి బడా బాబుల చేతుల్లోకి వెళ్లాయి. గతేడాది ఏప్రిల్‌‌లో జంట జలాశయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు రూపొందించేందుకు జీవో 69ను అప్పటి సీఎస్ సోమేశ్‌‌​ కుమార్ జారీ చేశారు. అయితే అంతకంటే ముందు నుంచే కొందరు నేరుగా రైతుల దగ్గరకు వెళ్లి బేరసారాలు చేసుకుని అగ్గువకే భూములు కొన్నారు. 

ఇక 69 జీవో ఇచ్చిన తర్వాత ఇంకింత ఎక్కువగా భూలావాదేవీలు జరిగాయి. రాష్ట్ర సర్కార్ ఇటీవల రిజిస్ర్టేషన్ ఆదాయం ఎంత ఉందనే దానికోసం తెప్పించుకున్న రిపోర్టుల్లోనూ ఇదే విషయం స్పష్టమైనట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అధికారంలోకి వస్తే 111 జీవో ఎత్తివేస్తామని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. బయటకు మాత్రం ‘అంత ఈజీ కాదు’ అనే సంకేతాలు పంపిస్తూనే.. ఇంటర్నల్‌గా లీడర్లకు అసలు విషయాన్ని చేరవేయడంతోనే వేల ఎకరాల కొనుగోళ్లు జరిగాయని గ్రామాల్లోని రైతులు అంటున్నారు.

ఆర్ఆర్ఆర్.. ఎయిర్​పోర్ట్ మెట్రో తమకు కలిసొచ్చేలా

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్), రాయదుర్గం - ఎయిర్​పోర్ట్ మెట్రో రేడియస్​లో, రోడ్లకు దగ్గరలో ప్రైమ్ లొకేషన్లలోనే ఎక్కువ భూములు రైతుల చేతుల నుంచి బడా బాబుల చేతుల్లోకి వెళ్లాయి. షాబాద్, చేవెళ్ల, శంషాబాద్, శంకర్​పల్లి, కొత్తూరు, మొయినాబాద్ ప్రాంతాల్లో వేల ఎకరాల కొనుగోళ్లు జరిగాయి. మొయినాబాద్ ప్రాంతంలో చాలా మంది ప్రజాప్రతినిధులు, లీడర్లు నిబంధనలకు విరుద్ధంగా ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగానికి గత ఏడాది సెప్టెంబర్​లోనే కేంద్రం అనుమతి ఇచ్చింది. అదే అదునుగా దానికి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూములన్నింటినీ గంపగుత్తగా తీసేసుకున్నారు.

రాయదుర్గం - ఎయిర్​పోర్ట్ మెట్రో రూట్‌లోనూ 111 జీవో పరిధిలో ఉండే భూములు ఉన్నాయి. వాటిని కూడా అధికార పార్టీ లీడర్ల ఖాతాల్లో వేసుకున్నారు. జీవో పరిధిలో 1,32,600 ఎకరాల భూమి ఉంది. ఇందులో 18,332 ఎకరాలు ప్రభుత్వ, 9,235 ఎకరాల అసైన్డ్, 2,660 ఎకరాల సీలింగ్, 1,256 ఎకరాల భూదాన, ఇలా.. మొత్తం 31,483 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇవిపోను బడా బాబులు, లీడర్లు, రియల్టర్లు, బిల్డర్లు, వివిధ కంపెనీల కింద కొనుగోలు చేసిన భూములు మరో 35 వేల ఎకరాల పైనే ఉంటాయని అంచనా.

వందల ఎకరాలు

111 జీవోను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే కంటే ముందే కొందరు లీడర్లకు లీకులిచ్చినట్లు తెలుస్తున్నది. అందులో భాగంగానే బీఆర్ఎస్ లీడర్లు, బడా రియల్టర్లు, బిల్డర్లు ఒక్కొక్కరు కనీసం 20 ఎకరాలకు తగ్గకుండా భూములు కొనుగోళ్లు చేశారు. కొందరైతే ఏకంగా వందల ఎకరాల్లో కొనుక్కుని పెట్టుకున్నారు. ఒక్కసారి ప్రభుత్వం ఆ ఏరియాల్లో ఆంక్షలు ఎత్తివేస్తే.. రియల్ భూమ్ వస్తుందని, పది రెట్ల లాభం ఉంటుందనే భారీగా భూములు కొన్నట్లు ఆఫ్ ది రికార్డుల్లో కొందరు లీడర్లు చెబుతున్నారు. ఐదుగురు మంత్రులు ఆయా ప్రాంతాల్లో బంధువుల పేరిట ల్యాండ్స్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు కేబినెట్‌ నిర్ణయం మేరకు 69 జీవో వచ్చిందని చెబుతున్నారు.

గ్రీన్ జోన్లు, ఇతర బఫర్​ జోన్లు, రెండు రిజర్వాయర్ల పరిరక్షణ, కాలుష్య నివారణకు అవసరమైన చర్యలు, ప్రధాన మౌలిక సదుపాయాల కల్పనపై విధివిధానాల కోసం గతేడాది ఆ జీవో ఇచ్చారు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో.. జనం తమను భూముల కోసం అప్రోచ్ అయిన వాళ్లకు అమ్మేసుకున్నారు. 69 జీవో కంటే ముందు ఆరు నెలల కాలంలో 6,800 ఎకరాలు ప్రైమ్ లోకేషన్లలో కొనుగోళ్లు జరిగాయి. తర్వాత ఇంకో 5 వేల ఎకరాలకు సంబంధించిన లావాదేవీలు జరిగినట్లు తెలిసింది. అనుకున్న ప్రాంతాల్లో తమవాళ్లు భూములు కొనుగోళ్లు చేశారనే దానిపై క్లారిటీ వచ్చాకే 111 జీవోను పూర్తిస్థాయిలో ఎత్తివేసి చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్, నాలా కన్వర్షన్‌పై కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించినట్లు తెలిసింది.