దళితబంధు స్కీంలో ఒకే ట్రాక్టర్ ఇద్దరికి పంపిణీ

దళితబంధు స్కీంలో ఒకే ట్రాక్టర్ ఇద్దరికి పంపిణీ
  • 12 యూనిట్​లు.. 22 మందికి పంపిణీ   
  • ట్రాక్టర్ విషయంలో గొడవతో పోలీస్ స్టేషన్​కు చేరిన పంచాదీ  

వరంగల్‍/నల్లబెల్లి, వెలుగు: దళితబంధు స్కీంలో ఒకే ట్రాక్టర్​ను ఎమ్మెల్యే ఇద్దరికి పంచడంతో లబ్ధిదారుల మధ్య పంచాయితీ పోలీస్‍ స్టేషన్​కు చేరింది. వరంగల్‍ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‍రెడ్డి సొంత మండలం నల్లబెల్లి పరిధిలోని రామతీర్థం(అర్సనపల్లి) గ్రామంలో 12 దళితబంధు యూనిట్​లను 22 మంది లబ్ధిదారులకు.. ఒక్కో యూనిట్​ను ఇద్దరిద్దరికి కలిపి పంపిణీ చేశారు. రికార్డుల్లో ఒక లబ్ధిదారు పేరు మాత్రమే ఉండగా.. ఇంకో లబ్ధిదారుకూ హక్కు ఉన్నట్లు బాండ్ పేపర్లు రాయించి ఇచ్చారు. ఒకే ట్రాక్టర్ యూనిట్​ను దామెర రాజేశ్‍, దామెర భిక్షపతి అనే ఇద్దరు లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందించారు. వీరికి ట్రాక్టర్​పై సమాన హక్కులు ఉంటాయని బాండ్ పేపర్ రాయించి ఇచ్చారు. తర్వాత ట్రాలీ కోసం డబ్బులు రావడంతో రాజేశ్ పాత ట్రాలీ కొన్నాడు. ఈ విషయంలో ఇద్దరికి గొడవ జరగడంతో ట్రాక్టర్ ఓనర్​ను తానేనని, భిక్షపతితో  రాజేశ్ వాదించాడు. పెద్ద మనుషులు చెప్పినా అతను వినకపోవడంతో న్యాయం చేయాలంటూ భిక్షపతి కుటుంబ సభ్యులు బుధవారం నల్లబెల్లి పోలీస్‍ స్టేషన్‍ లో ఫిర్యాదు చేశారు.   

డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు  

4 నెలల కింద దళితబంధు మొదటి విడతలో నియోజకవర్గంలోని 6 మండలాలకు100 యూనిట్లు మంజూరయ్యాయి. అర్సనపల్లి గ్రామానికి12 యూనిట్లు వచ్చాయి. 12 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిఉండగా అధికార పార్టీ లీడర్లు కొందరి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కలెక్టర్‍ గోపి విచారణ చేయించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కలుగజేసుకుని ఒక్కో యూనిట్‍ను ఇద్దరికి కలిపి..12 యూనిట్లను 22 మందికి పంపిణీ చేశారు. ఇందులో 6 హార్వెస్టర్లు, 5 ట్రాక్టర్లు, కారు ఉన్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో యూనిట్ ఒకరి పేరిటే ఉన్నా, ఇద్దరికీ హక్కు ఉన్నట్లు బాండ్‍ పేపర్లు సైతం రాయించి ఇవ్వడం గమనార్హం.