ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో శరత్ చంద్రారెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. న్యాయమూర్తి జస్టిస్ నాగ్ పాల్ ధర్మాసనం విచారణ జరిపింది. తమ నానమ్మ కర్మకాండలు జరపాల్సిన నేపథ్యంలో శరత్ చంద్రారెడ్డికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఈనెల 25వ తేదీన సాయంత్రం శరత్ చంద్రారెడ్డి నానమ్మ చనిపోయారని రౌస్ అవెన్యూ కోర్టుకు ఆయన తరపు న్యాయవాది తెలిపారు. తమ నానమ్మ అంత్యక్రియలు, కర్మకాండల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శరత్ చంద్రారెడ్డికి రెండు వారాల బెయిల్ ఇవ్వాలని కోరారు. శరత్ తండ్రి విదేశాల్లో ఉన్నారని, ఆయన నానమ్మ చివరి కోరిక మేరకు ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శరత్ చంద్రారెడ్డికి అనుమతిస్తూ.. బెయిల్ ఇవ్వాలని కోరారు.
గతంలో సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి శరత్ రెడ్డికి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఈడీ తరపు న్యాయవాది వాదించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు శరత్ చంద్రారెడ్డి మధ్యంతర బెయిల్ పై రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది.
