సింగరేణిలో సమ్మె సైరన్?    ప్రభుత్వ తీరుపై కార్మిక సంఘాల అసంతృప్తి

సింగరేణిలో సమ్మె సైరన్?    ప్రభుత్వ తీరుపై కార్మిక సంఘాల అసంతృప్తి
  • వారంలో చర్చలు జరపకుంటే సమ్మెకు వెళ్లాలని నిర్ణయం

గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో సమ్మె సైరన్ మోగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా పెండింగ్‌‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో మేనేజ్‌‌మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సింగరేణి జాతీయ కార్మిక సంఘాలతో పాటు టీబీజీకేఎస్ యూనియన్ ముఖ్య నాయకులు ఆదివారం గోదావరిఖని ఐఎన్‌‌టీయూసీ కార్యాలయంలో సమావేశమయ్యారు.

ముఖ్యంగా మెడికల్ బోర్డు ద్వారా ఎంపికైన 340 మందికి శిక్షణ ఇచ్చినా వారికి గనుల్లో పనిచేసేందుకు నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడం, ఆరు నెలలుగా మెడికల్ బోర్డు సమావేశం నిర్వహించకపోవడం వంటి అంశాలను నాయకులు ప్రస్తావించారు. అలాగే ఏఎల్‌‌పీ, 7 ఎల్‌‌ఈపీ గనుల్లో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల పిల్లలకు తగిన ఉద్యోగాలు ఇవ్వకపోవడం, ప్రభుత్వం వద్దకు మూడు సార్లు వెళ్లినా ఇండస్ట్రియల్ రిలేషన్స్‌‌లో భాగంగా కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

గత 45 రోజులుగా సింగరేణి డైరెక్టర్(పర్సనల్) గౌతమ్ పొట్రూ పశ్చిమ బెంగాల్ ఎన్నికల పనులతో వెళ్లి అందుబాటులో లేకపోవడం కూడా కార్మిక సమస్యలు పెరగడానికి కారణమైందని పేర్కొన్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో ప్రభుత్వం లేదా సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాలతో చర్చలు జరపని పక్షంలో రెండో వారంలో మేనేజ్‌‌మెంట్‌‌కు సమ్మె నోటీసు ఇవ్వాలని యూనియన్ నాయకులు నిర్ణయించారు.

ఈ సమావేశంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య, కార్యదర్శి రాజ్‌‌కుమార్, ప్రాతినిధ్య సంఘం ఐఎన్‌‌టీయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్, ధర్మపురి, హెచ్‌‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి టి.రాజిరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏఐటీయూసీ భాస్కర్‌‌రావు భవన్‌‌లో జరిగిన మరో సమావేశంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య, కార్యదర్శి కె.రాజ్‌‌కుమార్ మాట్లాడుతూ సింగరేణిలో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.