పండగ సీజన్లో పెట్రోల్, డీజిల్ భారీగా అమ్మకం

పండగ సీజన్లో  పెట్రోల్, డీజిల్ భారీగా అమ్మకం

న్యూఢిల్లీ:  పండుగ సీజన్‌‌ ప్రారంభం కావడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, రవాణా ఇంధన డిమాండ్  పెరిగిపోవడంతో  ఈ నెల మొదటి రెండు వారాల్లో పెట్రోల్, డీజిల్ ​విపరీతంగా అమ్ముడయ్యాయి. వీటి అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 22–-26 శాతం పెరిగాయి. నెలవారీగా కూడా పెరిగాయి. ప్రస్తుత నెల 1-–15 తేదీల మధ్య  పెట్రోల్ అమ్మకాలు 22.7 శాతం పెరిగి 1.28 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో 1.05 మిలియన్ టన్నులు అమ్ముడయ్యాయి. 2020 అక్టోబర్ అమ్మకాలతో పోలిస్తే ఇవి 31 శాతం ఎక్కువ.  ప్రీ-పాండమిక్ కాలంగా పిలిచే 2019 అక్టోబర్ 1-–15 తేదీలతో పోలిస్తే  ఇవి 33.4 శాతం ఎక్కువ. గత సెప్టెంబర్​లో ఇదే కాలంతో పోలిస్తే 1.3 శాతం ఎక్కువ. దేశంలో అత్యధికంగా ఉపయోగించే ఇంధనం అయిన డీజిల్ అమ్మకాలు, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అక్టోబర్ మొదటి పక్షం రోజుల్లో 27 శాతం పెరిగి 3.08 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. 2020 అక్టోబర్ 1-–15 తేదీలతో పోలిస్తే వినియోగం 16 శాతం పెరిగింది.  కోవిడ్ 2019 కి ముందుకాలం వాడకం కంటే ఇది 26.6 శాతం ఎక్కువ. ఆ తర్వాత నెలలో పుంజుకోవడానికి ముందు ఆగస్టులో అమ్మకాలు దాదాపు 5 శాతం పడిపోయాయి.

రుతుపవనాలు ముగియడం,  వ్యవసాయ సీజన్‌‌లో పుంజుకోవడం డీజిల్ డిమాండ్ పెరగడానికి దారితీసిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రుతుపవనాలు మందగమనం, డిమాండ్ తగ్గిన కారణంగా ఈ ఏడాది జులై, ఆగస్టులలో ఇంధన అమ్మకాలు తగ్గాయి. వేసవి ప్రయాణం పెరిగిన కారణంగా జూన్‌‌లో మాత్రం అమ్మకాలు పెరిగాయి. విమానయాన రంగం తిరిగి ప్రారంభమైనందున, విమానాశ్రయాలలో భారతదేశం  మొత్తం ప్రయాణీకుల రద్దీ ప్రీ-కొవిడ్​ స్థాయిలకు చేరుకుంది. జెట్ ఇంధనం (ఏటీఎఫ్​) డిమాండ్ గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అక్టోబర్ మొదటి 15 రోజుల్లో 22.1 శాతం పెరిగి 26,400 టన్నులకు చేరుకుంది. ఇది 2020 అక్టోబర్ 1–-15 తేదీల్లో అమ్మకాల కంటే 64 శాతం ఎక్కువ. అయితే 2019 మొదటి రెండు వారాల్లో అమ్మకాలో పోలిస్తే 16.5 శాతం తక్కువ.