
మానసిక ఆరోగ్యం బాగాలేని వాళ్లలో, దివ్యాంగుల్లోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. వాళ్ల టాలెంట్‌ని పసిగట్టి, ప్రోత్సహిస్తే వాళ్లు కూడా అద్భుతాలు సాధిస్తారు. ఎవరి సాయం లేకున్నా సొంతంగా బతకగలుగుతారు. చెన్నైలోని ఈ మ్యూజియం అదే పనిచేస్తోంది. ‘మ్యూజియం ఆఫ్ పాజిబిలిటీస్’ పేరుతో ఈమధ్యే మెరీనా బీచ్‌కి దగ్గర్లోని కామరాజర్ సలాయ్లో దీన్ని ఏర్పాటు చేశారు.
దివ్యాంగుల టాలెంట్ హబ్ అయిన ఈ మ్యూజియంలో... మ్యూజియం ఆఫ్ పాజిబిలిటీస్. వాళ్లకు పనికొచ్చే వస్తువుల్ని ప్రదర్శనకు పెడతారు. చూపులేని వాళ్లకు కంప్యూటర్ నేర్పిస్తారు. ఇందులోని ప్రతి వస్తువు మీద క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్‌ని స్కాన్ చేస్తే ఆ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుంది? దాని ఉపయోగం ఏంటి? వంటి వివరాలు తెలుసుకోవచ్చు. దివ్యాంగులు వేసిన పెయింటింగ్స్, చేతితో చేసిన అలంకరణ వస్తువుల్ని ఇందులో ప్రదర్శిస్తారు. వాళ్లకు ఏది అవసరమో, ఏ వస్తువుని ఎలా ఉపయోగించాలో చెప్తారు ఫిజియోథెరపిస్ట్‌లు, స్పీచ్ థెరపిస్ట్‌లు. ఇక్కడి ఫస్ట్ ఫ్లోర్లో కెఫె ఉంటుంది. అందులో పనిచేసేవాళ్లంతా దివ్యాంగులే. డిఫరెంట్లీ ఏబుల్డ్ డిపార్ట్మెంట్ కోటి రూపాయల ఖర్చుతో ఈ మ్యూజియం ఏర్పాటు చేసింది. కంటిచూపు సరిగా లేని శైలేష్ దీనికి మేనేజర్.
మోడల్ హౌస్
దివ్యాంగుల గది ఎలా ఉంటే వాళ్లు కంఫర్ట్‌గా ఉంటారు? అనేది చెప్పడానికి ఈ మ్యూజియంలో ఒక మోడల్ హౌస్ ఏర్పాటుచేశారు. ఇందులో కిచెన్‌లో షెల్ప్‌లు కింద ఉన్నాయి. ఫ్యాన్, లైట్లను రిమోట్‌తో ఆపరేట్ చేయొచ్చు. బెడ్రూమ్కి స్లైడింగ్ డోర్ ఉంది. బాత్రూమ్లో వెస్టర్న్ కమోడ్, పట్టుకునేందుకు వీలుగా గ్రాబ్ బార్స్ ఉన్నాయి.