
హైదరాబాద్ : బీఆర్ కే భవన్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అగ్నిప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అగ్నిప్రమాదాల నివారణ కోసం చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఫైర్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ కు నిధులు కేటాయించాలని, వీలైతే ఈ బడ్జెట్ లోనే నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు కార్పొరేషన్లలో ఫైర్ సేఫ్టీ, బిల్డింగ్ ఓనర్లను కూడా భాగస్వాములను చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఫైర్ సేఫ్టీపై సెల్ఫ్ సర్టిఫికెట్ కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించారు. ఫైర్ సేఫ్ట్ యాక్ట్ లో ప్రస్తుతం ఉన్న చట్టానికి అవసరమైన మార్పులు చేసేందుకు రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు.. సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలోని దక్కన్ మాల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆచూకీ లభ్యంకాని ముగ్గురు వ్యక్తుల కుటుంబాలకు రాష్ర్ట ప్రభుత్వం తరపు నుంచి రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించారు. రాష్ర్ట హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో GHMC, ఫైర్, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.