ఆ పదేళ్ల పిల్లోడు.. నిజంగానే థియేటర్ లోని లేడీస్ వాష్ రూంలో కెమెరా పెట్టాడా?

ఆ పదేళ్ల పిల్లోడు.. నిజంగానే థియేటర్ లోని లేడీస్ వాష్ రూంలో కెమెరా పెట్టాడా?

బెంగళూరులో తమ అభిమాన నటుడు సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లిన మహిళలకు ఊహించని షాక్ ఎదురైంది.  మడివాళలోని సంధ్య థియేటర్‌  లేడీస్ వాష్‌రూమ్‌లో  ఒక సీక్రెట్ కెమెరా బయటపడింది. ఈ ఘటన సినీ ప్రేక్షకులను, ముఖ్యంగా మహిళలను ఉలిక్కిపడేలా చేసింది. కొందరి వికృత మనస్తత్వంతో రక్షణ లేకుండా పోయిందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ క్లాసిక్ హిట్ 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా రీ-రిలీజ్ సందర్భంగా ఆదివారం థియేటర్ కిటకిటలాడింది. తెలుగు ప్రేక్షకులు భారీ సంఖ్యలో థియేటర్‌కు తరలివచ్చారు. సినిమా ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఒక మహిళ లేడీస్ వాష్‌రూమ్‌కు వెళ్లారు. అక్కడ గమనించగా, రహస్యంగా ఒక సీక్రెట్ కెమెరా ద్వారా రికార్డింగ్ జరుగుతున్నట్లు ఆమె గుర్తించి షాక్‌కు గురయ్యారు. వెంటనే ధైర్యం చేసి బయటకు వచ్చి జరిగిన విషయాన్ని మిగిలిన ప్రేక్షకులకు వివరించారు. ఈ వార్త థియేటర్ అంతటా వ్యాపించడంతో ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.

Also Read :  పూనకంతో ఊగిపోయిన సుధా చంద్రన్

నిందితుడిని పట్టుకున్న జనం

మహిళల ప్రైవసీకి భంగం కలిగిస్తున్నాడన్న కోపంతో ప్రేక్షకులు అక్కడ గాలించగా, ఒక బాలుడు అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని పట్టుకుని నిలదీయగా అసలు విషయం బయటపడింది. ఆగ్రహించిన ప్రేక్షకులు నిందితుడిని దేహశుద్ధి చేశారు. అనంతరం వెంటనే మడివాళ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో ఆ మైనర్ బాలుడు రెండు వారాల క్రితం నేపాల్ నుంచి బెంగళూరుకు వచ్చాడని తేలింది. అయితే సైన్ బోర్డు గమనించకుండాలేడీస్ వాష్ రూమ్ కి ప్రవేశించాడు.  లోపల మొబైల్ ఫోను ఉపయోగిస్తున్నాడని,. దర్యాప్తులో భాగంగా బాలుడి మొబైల్ ను పరిశీలిస్తున్నాము. అతన్ని జువైనైల్ హోమ్ కు అప్పగిస్తామని పోలీసులు అధికారులు తెలిపారు. బాలుడి మామయ్య థియేటర్ ప్రాంగణంలోనే హౌస్ కీపింగ్ గా పనిచేస్తున్నాడని చెప్పారు. 

వెల్లువెత్తుతున్న ఆగ్రహం

థియేటర్ లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రజలు వినోదం కోసం థియేటర్లకు వస్తే, ఇలాంటి నీచమైన పనులు చేయడం దారుణం అని మండిపడుతున్నారు. బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేస్తూ, నిందితుడికి కఠిన శిక్ష పడాలని, అలాగే థియేటర్లలో మహిళల భద్రతపై కఠిన నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో, మాల్స్ లేదా థియేటర్లలో వాష్‌రూమ్స్ ఉపయోగించేటప్పుడు మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే గట్టిగా అరవాలని లేదా భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేయాలని నెటిజన్లు సూచిస్తున్నారు.