అందరి దృష్టి ఎఫ్​ఓఎంసీ సమావేశంపైనే

అందరి దృష్టి ఎఫ్​ఓఎంసీ సమావేశంపైనే

ముంబై: ఇన్​ఫ్లేషన్​ను తగ్గించడానికి గ్లోబల్ సెంట్రల్  బ్యాంకులు దూకుడుగా వడ్డీరేట్ల పెంచుతాయనే ఆందోళనలు ఉన్నప్పటికీ, భారతీయ స్టాక్​ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతూనే ఉంది. కొనుగోళ్లు బాగుండటంతో సెన్సెక్స్,  నిఫ్టీ మంగళవారం వరుసగా రెండవ సెషన్‌‌లో లాభాలను సంపాదించాయి.  పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లిపోతుందనే భయాల మధ్య యూఎస్​ ఫెడరల్ రిజర్వ్ ఈ వారంలో తమ విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. మరోసారి వడ్డీరేట్లను పెంచుతారనే అంచనాలు ఉన్నాయి. అయినప్పటికీ బిఎస్‌‌ఇ సెన్సెక్స్ 578.51 పాయింట్లు  (0.98 శాతం) పెరిగి 59,719.74 వద్ద స్థిరపడింది.  ఇంట్రాడేలో ఇది 964.56 పాయింట్లు పెరిగి  60,105.79 వద్దకు చేరుకుంది.

ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 194 పాయింట్లు (1.10 శాతం) పెరిగి 17,816.25 వద్ద ముగిసింది. ఇంట్రా-డే ట్రేడ్‌‌లో   297.05 పాయింట్లు  పెరిగి 17,919.30 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్‌‌లో సన్ ఫార్మా అత్యధికంగా 4.71 శాతం లాభపడగా, ఇండస్‌‌ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, టైటాన్, బజాజ్ ఫిన్‌‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్,  ఏషియన్ పెయింట్స్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. నెస్లే ఇండియా, పవర్‌‌గ్రిడ్, ఇన్ఫోసిస్  రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.6–4 శాతం వరకు నష్టపోయాయి. వెస్టర్న్​ మార్కెట్ల బలహీనత దేశీయ మార్కెట్‌‌పై ప్రభావం చూపలేదని, భారత మార్కెట్ ఫెడ్ పాలసీకి భయపడటం లేదని  జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌కు చెందిన వినోద్​ నాయర్​ అన్నారు.

అందరి దృష్టి బుధవారం జరగనున్న ఎఫ్​ఓఎంసీ సమావేశంపైనే ఉంటుందని అన్నారు. బ్రాడ్​ మార్కెట్‌‌లో, బిఎస్‌‌ఇ మిడ్‌‌క్యాప్ ఇండెక్స్ 1.65 శాతం ర్యాలీ చేయగా, స్మాల్‌‌క్యాప్ గేజ్ 1.01 శాతం పెరిగింది. అన్ని బిఎస్‌‌ఇ సెక్టార్​ సూచీలు గ్రీన్‌‌లో ముగిశాయి. హెల్త్‌‌కేర్ 2.81 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ (2.17 శాతం), ఆటో (1.59 శాతం), కన్స్యూమర్ డిస్క్రెషనరీ  (1.47 శాతం), మెటల్ (1.34 శాతం)  కమోడిటీలు (1.29 శాతం) లాభపడ్డాయి. ఆసియా దేశాల్లో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మిడ్ సెషన్ డీల్స్‌‌లో యూరోపియన్ ఈక్విటీ మార్కెట్లు నెగటివ్​గా ట్రేడ్ అవుతున్నాయి. సోమవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి.  అంతర్జాతీయ చమురు బెంచ్‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌‌కు 0.49 శాతం పెరిగి 92.45 డాలర్లకు చేరుకుంది. డాలర్‌‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు పెరిగి 79.74 (తాత్కాలిక) వద్ద స్థిరపడింది.  ఎఫ్‌‌ఐఐలు సోమవారం నికర రూ. 312.31 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.