తెలంగాణలో.. బరిలో ఉంటామా? లేదా?.. డైలమాలో జనసేన పార్టీ నేతలు

తెలంగాణలో.. బరిలో ఉంటామా? లేదా?..  డైలమాలో జనసేన పార్టీ నేతలు
  • తెలంగాణలో.. బరిలో ఉంటామా? లేదా?
  • డైలమాలో జనసేన పార్టీ నేతలు 
  • పవన్​తో బీజేపీ నేతల భేటీతో సీన్​ రివర్స్​

హైదరాబాద్‌‌, వెలుగు : రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన నేతలు, కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.  అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉండగా.. జనసేన పార్టీలో ఎలాంటి ఉలుకూపలుకు లేదు. ఆ పార్టీ అగ్రనేతలు ఏపీలో ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తూ.. తెలంగాణ పార్టీ వ్యవహారాలు ఇక్కడి నేతలకే వదిలేశారు. తాజాగా హైదరాబాద్‌‌ వచ్చిన పవన్‌‌ కల్యాణ్‌‌తో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఆ  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌‌ బుధవారం పవన్‌‌ కల్యాణ్​ను కలిశారు. ఈ భేటీలో తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని పవన్​కల్యాణ్ ను ​వారు కోరినట్లు సమాచారం. ఇప్పటికే పోటీకి సిద్ధమైన పార్టీ క్యాడర్‌‌కు తాజా పరిస్థితులు అంతుబట్టకుండా ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

పవన్‌‌ కల్యాణ్‌‌ ఎన్డీఏలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్క గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌లోనే 8 సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్న జనసేన.. మిగతా చోట్ల 22 నుంచి 24 వరకు సీట్లలో పోటీ చేయాలని భావించింది. బీజేపీ నేతల సూచనలకు తలొగ్గి ఇక్కడి ఎన్నికల్లో పోటీ చేయకపోతే జనసేన పార్టీ పరిస్థితి ఏందనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో 
వ్యక్తమవుతోంది. 

ఇప్పటికే పోటీకి సిద్ధమైన జనసేన..

రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు జనసేన పార్టీ ఇప్పటికే రెడీ అయ్యింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్నికల బరిలోకి దిగడానికి  ఆ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. 32 స్థానాలలో పోటీ చేయడానికి జనసేన సిద్ధమవడంతో పాటు పోటీ చేసే స్థానాలు సైతం ప్రకటించింది. పోటీకి సంసిద్ధం కావాలని ఆ పార్టీ నాయకులకు పవన్​ దిశానిర్దేశం చేశారు. పార్టీ పోటీ చేసే స్థానాలపైన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజా సమీకరణలతో పొత్తుల వ్యవహారం తేలకపోవడంతో తెలంగాణలో పోటీలో ఉంటామా? లేదా? అనేది పార్టీ నేతల్లో డైలమా నెలకొంది.

మారుతున్న పొలిటికల్‌‌ స్ట్రాటజీ

రాష్ట్రంలో పొలిటికల్‌‌ స్ట్రాటజీ రోజురోజుకూ మారుతున్నది. ఇప్పటికే బీఆర్‌‌ఎస్‌‌ పై బీజేపీ, కాంగ్రెస్ తో పాటు బీఎస్పీ, టీడీపీ, వైఎస్సార్ టీపీ పోటీకి సిద్ధమవుతున్న వేళ తాజాగా జనసేన  కూడా ఎన్నికల కోసం కసరత్తు ముమ్మరం చేయడం ఆసక్తిని రేపుతోంది. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో గెలిచినా, గెలవకున్నా జనసేన నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో పోటీ చేసే స్థానాలను ఆ పార్టీ ప్రకటించింది. బీజేపీ నేతలతో పార్టీ అధినేత భేటీతో సీన్‌‌ రివర్స్​ అయినట్లు సమాచారం. దీంతో తెలంగాణలో పోటీలో ఉంటామా? లేదా? అనే డైలమా కొనసాగుతోంది.