Water Quota System : అక్కడ కార్లు కడగడం, చెట్లకు నీళ్లు పోయడం, వ్యవసాయానికి నీటి వినియోగం నిషేధం

Water Quota System : అక్కడ కార్లు కడగడం, చెట్లకు నీళ్లు పోయడం, వ్యవసాయానికి నీటి వినియోగం నిషేధం

ప్రకృతిలో మారుతున్న పరిస్థితులతో పాటు వనరులు కూడా రోజురోజుకూ అంతరించిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని నగరాల్లో స్వచ్ఛమైన గాలి దొరకక, కొనుక్కునే దౌర్భాగ్యపు స్థితిని అనుభవిస్తున్నారు. అలా నీరు కూడా అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా... కొన్ని ప్రాంతాల్లో మంచి నీటిని కొనుక్కుంటున్న వాళ్లూ లేకపోలేదు. కానీ మరీ అతిగా తాగితే ఫైన్ విధించేంత అయితే లేదు. కానీ ఓ దేశంలో ఈ తరహా పరిస్థితులే ఉన్నాయి. నీటి కొరత కారణంగా అక్కడ నీటిపై కోటా పద్ధతిని అమలుచేస్తున్నారు.

ట్యునీషియా అనే దేశంలోని ప్రజలు నీటిని అత్యంత విలువైనది భావిస్తారు. కారణం అక్కడ విధించిన నీటి కోటా విధానమే. రేషన్ మాదిరిగా అక్కడి ప్రజలకు తాగే మంచి నీటిని కూడా కొలిచి ఇస్తున్నారు. తాగు నీటి కోటా విధానం అమలు నేపథ్యంలో ఇప్పటికే వ్యవసాయానికి నీటి వినియోగంపై పూర్తి నిషేధం విధించారు. ట్యునీషియా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఆ దేశం చాలా నెలలుగా తీవ్రమైన కరువుతో బాధపడుతోంది. గత సంవత్సరం నుంచి ట్యునీషియాలో వర్షాభావ పరిస్థితులు ఉన్నందున డ్యామ్‌లలో నీరు అసలు నీటి సామర్థ్యంలో 30 శాతం మాత్రమే మిగిలి ఉంది. ఈ పరిస్థితి చూస్తుంటే గత 6 నెలలుగా నీటిని రేషన్ పద్దతిలో పంపిణీ చేస్తున్నారు. 

అందులో భాగంగా కారును కడగడం, చెట్లు, మొక్కలకు నీళ్లు పోయడంపై కూడా నిషేధం విధించారు. బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేయడానికి నీటిని ఉపయోగించడంపైనా నిషేధం ఉంది. అంతే కాదు ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానా లేదా జైలు శిక్ష కూడా విధించవచ్చు. నీటి చట్టం ప్రకారం, నిబంధనలను ఉల్లంఘించిన వారికి 6 రోజుల నుండి 6 నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ఇక ఈ నీటి రేషన్‌పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల ద్రవ్యోల్బణం కూడా తీవ్ర స్థాయిలో పెరిగినట్టు తెలుస్తోంది.