కమ్యూనిస్టులు ఎవరి సేవలో?

కమ్యూనిస్టులు ఎవరి సేవలో?

నవంబర్​ 29న ‘వెలుగు’ దిన పత్రిక  ఓపెన్​ పేజీలో  సారంపల్లి మల్లా రెడ్డి రాసిన (కమ్యూనిస్టులపై విమర్శలా?) ప్రతిస్పందన వ్యాసం చదివి స్పందిస్తున్నాను. నేడు వామపక్షాలు దేశంలో పోషిస్తున్న పాత్ర ఏమిటి? రాజకీయ ప్రాధాన్యమేమిటి? దేశంలో కేసీఆర్​ లాంటి పాలకులకు తాబేదార్లుగా మారి కమ్యూనిస్టులు చేస్తున్నది ఏమిటి? ప్రజల సేవనా? తమ బతుకుదెరువు సేవనా? కేరళలో అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ‘ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’పై ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది? కమ్యూనిస్టులు పేదల కోసమే పనిచేస్తున్నట్లయితే, పశ్చిమ బెంగాల్‌లో ఎందుకు అధికారాన్ని కోల్పోయారు? మల్లా రెడ్డి తాము ప్రైవేటీకరణకు వ్యతిరేకమన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ జెన్​కోకు కేటాయించిన తాడిచెర్ల గనిని, రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పార్టీకి ఇచ్చింది.

కమ్యూనిస్టులకు ఇది కనిపించలేదా? అయినా మునుగోడు ఎన్నికలో టీఆర్​ఎస్​కు ఎట్లా మద్దతిచ్చారు? ప్రైవేటీకరణపై ఈద్వంద్వ ప్రమాణాలేంది ? దేశంలో రోజు రోజుకు చిరునామా గల్లంతవుతున్న కమ్యూనిస్టులు కేసీఆర్​ పంచన చేరి తమ అవకాశవాదాన్ని ప్రజల ముందు చాటుకోలేదా? ఇప్పటికే  ఉత్తర భారతదేశంలో  కమ్యూనిస్ట్ పార్టీల జాడనే లేదు, అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ.  ఈ ద్వంద్వ ప్రమాణాలతో అక్కడా అధికారాన్ని కోల్పోవచ్చు. ఒక ప్రసిద్ధ పాశ్చాత్యుడు చెప్పినట్లుగా కమ్యూనిజం, మద్య నిషేధం, రెండూ కాగితంపై చదవటానికి చాలా బాగుంటాయి. ఆచరణలో వాటి అసలు రూపాలు బయటపడుతాయి. ఈ దేశ అస్థిత్వాన్ని కాపాడుతున్న మెజారిటీ ప్రజలను(హిందువులను) గుర్తించనంత కాలం, గౌరవించనంత కాలం భారత్​లో కమ్యూనిస్టుల రాజకీయం చెల్లని రూపాయి లాంటిదే. దీన్ని గుర్తుంచుకోవాలి. –హెచ్. వేణుగోపాల్ రాజు, కోనేరు పల్లి, కరీంనగర్​ జిల్లా