
- చెరువులో దొరికిన ఇందు డెడ్ బాడీ
- ఈ నెల 15న స్కూల్ నుంచి మిస్సింగ్
- పోలీసుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యుల ఆందోళన
- పోలీస్ వెహికల్ పై స్థానికుల దాడి
- మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో ఘటన
జవహర్ నగర్/పద్మారావునగర్, వెలుగు: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో దారుణం జరిగింది. గురువారం అదృశ్యమైన పదేండ్ల పాప.. శుక్రవారం చెరువులో శవమై తేలింది. చిన్నారి డెడ్ బాడీని చెరువులో నుంచి బయటకు తీసిన పోలీసులు.. కనీసం తల్లిదండ్రులకు కూడా చూపించకుండా హడావుడిగా గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో అటు చెరువు వద్ద, ఇటు గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి చనిపోయిందని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు.
స్కూల్ కు వెళ్లి..
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అంబేద్కర్ నగర్ లోని ఎన్టీఆర్ నగర్ లో జీడల నరేశ్ కుటుంబం ఉంటోంది. స్ర్కాప్ బిజినెస్ చేస్తున్న నరేశ్ కు ఇద్దరు ఆడబిడ్డలు, కొడుకు ఉన్నారు. చిన్న బిడ్డ ఇందు (10) దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని గవర్నమెంట్ స్కూల్ లో నాలుగో తరగతి చదువుతోంది. నరేశ్ రోజూ లాగే ఇందును గురువారం ఉదయం 9 గంటలకు స్కూల్ దగ్గర వదిలి వెళ్లాడు. 9:20 గంటలకు ఇందు తన బ్యాగును స్కూల్ లో పెట్టి ఆడుకోవడానికని బయటకు వెళ్లింది. క్లాస్ టీచర్10:20 గంటలకు అటెండెన్స్ తీసుకునే టైమ్ లో ఇందు క్లాసులో లేదు. దీంతో సిబ్బంది స్కూల్ అంతటా వెతికి, చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు స్కూల్ కు వచ్చి.. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు.
అయినా ఆచూకీ దొరక్కపోవడంతో పోలీస్ కంట్రోల్ రూమ్ 100కు ఫోన్ చేశారు. జవహర్ నగర్ పోలీసులు స్కూల్ వద్దకు వచ్చి.. అక్కడికి దగ్గర్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. స్కూల్ కు కొంత దూరంలో దమ్మాయిగూడ చెరువుకు వెళ్లే రోడ్డులో ఇందు వెళ్లినట్టు గుర్తించారు. కానీ గురువారం రాత్రి వరకు కూడా చిన్నారి ఆచూకీ దొరకలేదు.
అంబేద్కర్ నగర్లో చెరువులో తేలిన డెడ్ బాడీ..
స్కూల్ సిబ్బంది, పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇందు తప్పిపోయిందని శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కుటుంబసభ్యులు, స్థానికులు, ప్రతిపక్ష నాయకులు దమ్మాయిగూడ చౌరస్తాలో ఆందోళన చేశారు. వెంటనే ఇందు ఆచూకీ కనుక్కోవాలని డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. వాళ్లకు నచ్చజెప్పి పంపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఉదయం 10:30 గంటల ప్రాంతంలో అంబేద్కర్ నగర్ చెరువులో ఓ డెడ్ బాడీ తెలియాడుతోందని పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లిన పోలీసులు.. అది ఇందు డెడ్ బాడీగా గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీయించి, కనీసం ఆమె తల్లిదండ్రులకు కూడా చూపించకుండా గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో చెరువు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇందు చనిపోయిందని కుటుంబసభ్యులు, స్థానికులు మండిపడ్డారు. పోలీసులు కేవలం సీసీ కెమెరాలనే పరిశీలించారని, దగ్గర్లోని ప్రాంతాల్లో వెతికి ఉంటే తమ బిడ్డ దొరికేదని తల్లిదండ్రులు వాపోయారు. అంబేద్కర్ నగర్ ఏరియాలో కొంతమంది గంజాయ్ తాగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వాళ్లు చెరువు కట్టపై తిష్ట వేస్తున్నారని.. దీనిపై పోలీసులకు ఇంతకుముందే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు.
గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత..
పోస్టుమార్టం కోసం ఇందు డెడ్ బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. అక్కడికి ఎవరూ రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చిన్నారి మృతికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని రాష్ర్ట మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో ఆందోళన చేయగా.. ఆమెతో సహా మహిళా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోగా.. పోలీసులు పోస్టుమార్టం అనంతరం డెడ్ బాడీని ఎన్టీఆర్ నగర్ కు తరలించారు. అంబులెన్స్ లో డెడ్ బాడీని తీసుకెళ్లగా, ఎస్కార్ట్ గా పోలీసు వాహనాలు వెళ్లాయి. అంబేద్కర్ నగర్ వద్దకు రాగానే స్థానికులు కోపంతో పోలీస్ వాహనాలపై దాడి చేశారు. కర్రలు, రాళ్లతో కొట్టారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే చిన్నారి చనిపోయిందని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. చివరకు స్థానిక నాయకులు, పోలీసులు సర్ది చెప్పడంతో బాధితులు ఆందోళన విరమించి అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నారి చెరువులో పడి చనిపోయిందా? లేక ఎవరైనా తోసేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు బయటకు వస్తేనే మృతికి గల కారణాలు ఏంటనేది తెలుస్తుంది. గాంధీ డాక్టర్లను పోస్టుమార్టం వివరాలు మీడియా అడగ్గా.. వారు ఏమీ చెప్పలేదు. పూర్తి రిపోర్టు రావడానికి టైమ్ పడుతుందని చెప్పారు. కాగా, చిన్నారి ఇందు బావ గాంధీ హాస్పిటల్ దగ్గర మీడియాతో మాట్లాడడానికి ప్రయత్నించగా పోలీసులు అతణ్ని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు.దీంతో మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆడ పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని మహిళా కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ సునీతారావు అన్నారు. చిన్నారి ఇందు మృతికి పోలీసుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అసమర్థతే కారణమని ఆరోపించారు. ఇందు డెడ్ బాడీని తల్లిదండ్రులకు కూడా చూపించలేదన్నారు.