
గండిపేట, వెలుగు: హోటల్లో కస్టమర్‌కు అందించిన బిర్యానీలో బల్లి వచ్చిన ఘటన రాజేంద్రగర్ పీఎస్ పరిధిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన 8 మంది యువకులు శుక్రవారం డెయిరీ ఫామ్ చౌరస్తాలోని డెక్కన్ ఎలైట్ హోటల్లో బిర్యానీ తినేందుకు వెళ్లారు. హోటల్ సిబ్బంది బిర్యానినీ తీసుకొచ్చి వారికి సర్వ్ చేశారు.
అయితే, బిర్యానీ కొద్దిగా తిన్న తర్వాత అందులో బల్లి కనిపించడంతో షాక్‌కు గురైన యువకులు వెంటనే హోటల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిర్యానీలోకి బల్లి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అలాంటిదేమీ లేదని.. కావాలనే తమ హోటల్‌ను బద్నాం చేస్తున్నారని నిర్వాహకులు వారిని బెదిరించారు. కొద్దిసేపటికి 8 మంది యువకులు వాంతి చేసుకోగా.. వారిని అత్తాపూర్‌లోని ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం బాధిత కస్టమర్లు రాజేంద్రనగర్ పీఎస్‌లో కంప్లయింట్ చేశారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.