బ్యాంకు లాకర్లు కట్​ చేసి.. రెండున్నర కోట్ల బంగారం చోరీ

బ్యాంకు లాకర్లు కట్​ చేసి.. రెండున్నర కోట్ల బంగారం చోరీ
  • బ్యాంకు లాకర్లు కట్​ చేసి
  • రెండున్నర కోట్ల బంగారం చోరీ
  • కాలిపోయిన  రూ.7.30 లక్షల నగదు, పలు ఫైళ్లు
  • నిజామాబాద్ ​జిల్లా బుస్సాపూర్​లో ఘటన

మెండోరా, వెలుగు: బ్యాంకు లాకర్లను గ్యాస్​కట్టర్​తో కట్ చేసి దాదాపు రెండున్నర కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని ఎత్తుకెళ్లిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. దొంగలు లాకర్ కట్ చేసే క్రమంలో అందులో ఉన్న లక్షల రూపాయల నగదు, పలు ఫైళ్లు కూడా కాలిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మెండోరా మండలం బుస్సాపూర్ లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. స్ట్రాంగ్ రూమ్ ను, లాకర్లను గ్యాస్ కట్టర్ తో కట్ చేశారు. లాకర్లను కట్ చేసే సమయంలో అందులో ఉన్న రూ.7.30 లక్షల నగదు, పలు ఫైల్స్ కాలిపోయాయని పోలీసులు చెప్పారు. ఖాతాదారులు తాకట్టు పెట్టిన 830 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లినట్టు వివరించారు. అలాగే దొంగలు సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ ​డిస్క్, డీవీఆర్​ కూడా తీసుకెళ్లినట్లు చెప్పారు. మొత్తంగా రూ.3 కోట్ల వరకు నష్టం జరిగినట్లు తెలిపారు. ఉదయం వచ్చిన సిబ్బంది బ్యాంకు షెట్టర్లు తెరిచి ఉండడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిజామాబాద్ సీపీ కేఆర్ నాగరాజు, ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్, బ్యాంక్ ఉన్నతాధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. చోరీపై కేసు నమోదు చేశామని, ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని సీపీ తెలిపారు.