కార్పొరేట్​​ టాక్స్ కన్నా ఇన్​కంటాక్స్​ ఆమ్దానే ఎక్కువ

కార్పొరేట్​​ టాక్స్ కన్నా ఇన్​కంటాక్స్​ ఆమ్దానే ఎక్కువ
  • ఇన్​కంటాక్స్​ ఆమ్దానే ఎక్కువ
  • కార్పొరేట్​​ టాక్స్​ వసూళ్లను దాటేశాయ్‌
  • 12 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి
  • లిస్టెడ్​ కంపెనీల లాభాలు పెరిగినయ్​..
  • కార్పొరేషన్​ టాక్స్​ వసూళ్లు మాత్రం తగ్గినయ్​
  • 2020-21లో వసూళ్లు 17.9 శాతం డౌన్‌​
  • ఐటీ​ వసూళ్లు మాత్రం 2.3 శాతం అప్‌

న్యూఢిల్లీ: 2020–21 ఫైనాన్షియల్​ ఇయర్లో ఇన్​కంటాక్స్​ వసూళ్లు కార్పొరేషన్​ టాక్స్​ వసూళ్లను మించాయి. ఇలా ఇన్​కంటాక్స్​ వసూళ్లు ఎక్కువవడం 12 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. సెంట్రల్​ గవర్నమెంట్​ 2020–21 ఫైనాన్షియల్ ఇయర్​కు అకౌంట్లను ప్రకటించింది. చాలా ఏళ్లుగా ఇన్​కంటాక్స్ వసూళ్ల కంటే  కార్పొరేషన్​ టాక్స్​ వసూళ్లు ఎక్కువగా రికార్డవుతున్నాయి. 2020–21లో ఇన్​కంటాక్స్​ వసూళ్లు రూ. 4.69 లక్షల కోట్లు. ఇదే కాలానికి కార్పొరేషన్​ టాక్స్​ వసూళ్లు రూ. 4.57 లక్షల కోట్లే. అంటే ఇన్​కంటాక్స్​ వసూళ్లు కార్పొరేషన్​ టాక్స్​ వసూళ్ల కంటే రూ. 12 వేల కోట్లు ఎక్కువన్నమాట. దేశంలోని ఇండివిడ్యువల్స్​, హిందూ అన్​డివైడెడ్​ ఫ్యామిలీస్​ (హెచ్​యూఎఫ్​)లు ఇన్​కంటాక్స్​ చెల్లిస్తారు. తమకు వచ్చే లాభాలపై కంపెనీలు చెల్లించేది కార్పొరేషన్​ టాక్స్​. 

ఐటీ వసూళ్లు ఎందుకు తగ్గాయంటే..
ఇన్​కంటాక్స్​ వసూళ్లు కార్పొరేషన్​ టాక్స్​ వసూళ్ల కంటే ఎందుకు ఎక్కువయ్యాయనేది ఇప్పుడు ప్రశ్న. కిందటేడాది కరోనా వైరస్​ ఎఫెక్ట్​తో వ్యాపారాలన్నీ కుదేలవడమే కంపెనీల లాభాలు తగ్గడానికి కారణమనేది ఒక జవాబు. ఫలితంగా ఆ కంపెనీలు తక్కువ టాక్స్​ చెల్లించాయి. అయితే, కొంచెం లోతుగా చూస్తే... ఇదొక్కటే కారణం కాదని తెలుస్తుంది. దేశంలోని లిస్టెడ్​ కంపెనీల లాభాలు 2020–21లో జీడీపీలో 2.6 శాతానికి పెరిగాయి. 2014–15 తర్వాత ఇంత ఎక్కువ ఉండటం ఇదే మొదటిసారి. 2014–15లో లిస్టెడ్​ కంపెనీల లాభాలు జీడీపీలో 3.1 శాతంగా నమోదయ్యాయి. నిజానికి ఇంకా కొన్ని కంపెనీలు తమ ఫైనాన్షియల్​ రిజల్ట్స్​ ప్రకటించాల్సి ఉంది. ఇక 2019–20కి చూస్తే లిస్టెడ్​ కార్పొరేట్ల లాభాలు జీడీపీలో 1.1 శాతంగా ఉన్నాయి. 2020–21లో లిస్టెడ్​ కంపెనీల ప్యాట్​ (ప్రాఫిట్​ ఆఫ్టర్​ టాక్స్​) లేదా నికర మార్జిన్​ 9.1 శాతం. 2007–08 ఫైనాన్షియల్​లోని 10.2 శాతం తర్వాత ఇదే ఎక్కువ. కాకపోతే, కార్పొరేషన్​ టాక్స్​ను అన్​లిస్టెడ్​ కంపెనీలు కూడా చెల్లిస్తాయి. కాబట్టే, 2020–21లో ఇన్​కంటాక్స్​ వసూళ్లు కార్పొరేషన్​ టాక్స్​ వసూళ్లను మించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2019–20తో పోలిస్తే కార్పొరేషన్​ టాక్స్​ వసూళ్లు 17.9 శాతం తగ్గాయి. ఆ ఏడాదిలో ఈ వసూళ్లు రూ. 5.57 లక్షల కోట్లు. 2019–20తో పోలిస్తే ఇన్​కంటాక్స్​ వసూళ్లు 2.3 శాతమే తగ్గాయి. 2019–20లో ఇన్​కంటాక్స్​ వసూళ్లు రూ. 4.8 లక్షల కోట్లు. కార్పొరేషన్​ టాక్స్​ రేటును అంతకు ముందున్న 30 శాతం నుంచి 22 శాతానికి సెప్టెంబర్​ 2019లో ప్రభుత్వం తగ్గించింది. కొత్త మాన్యుఫాక్చరింగ్​ కంపెనీలకైతే 25 శాతం నుంచి 15 శాతానికి టాక్స్​ రేటును తగ్గించారు. ఇన్వెస్ట్​మెంట్​ ఊపందుకునేలా చేయడం ద్వారా గ్రోత్​ కోసమే ఈ తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు. మేకిన్​ ఇండియా స్కీము కింద మాన్యుఫాక్చరింగ్​ రంగంలో కొత్త పెట్టుబడులను రాబట్టాలనేది ప్రభుత్వ టార్గెట్​. పన్ను రేట్లు తగ్గిస్తే పెట్టుబడిదారులు ముందుకొస్తారనేది ప్రభుత్వ ఆశాభావం. అయితే, ఇది కార్యరూపంలోకి వచ్చినట్లు లేదు. 2020–21లో జీడీపీలో ఇన్వెస్ట్​మెంట్​ రేషియో 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా 27.1 శాతానికి పడిపోయింది. 2019–20లో ఈ రేషియో 28.8 శాతం. 2007–08లో 35.8 శాతంగా రికార్డయిన ఈ రేషియో అప్పటి నుంచీ ఏటేటా తగ్గుతూనే వస్తోంది. ఈ నేపథ్యంలోనే లిస్టెడ్​ కంపెనీలు మునుపెన్నడూ లేనంతగా లాభాలు గడించినా, కార్పొరేషన్​ టాక్స్​ వసూళ్లు మాత్రం తగ్గిపోయాయి.

పెద్ద కంపెనీలకు లాభాలు
సప్లయర్లు, కాంట్రాక్టర్లతో డిస్కషన్స్​ ద్వారా తమ కాస్ట్​లను లిస్టెడ్​ కంపెనీలు తగ్గించుకోలిగాయి.    ఉద్యోగులతోనూ డిస్కస్​ చేశాయి. చిన్నకంపెనీలు కష్ట కాలం ఎదుర్కొంటున్నాయి.  పైనుంచి పడిన ఎఫెక్ట్​ అంతా వాటిమీదకే జారింది. ఈ ప్రాసెస్​లో సప్లయర్లు, కాంట్రాక్టర్ల లాభాలు తగ్గిపోయాయి. ఫలితంగా కార్పొరేషన్​ టాక్స్​ వసూళ్లు  తగ్గాయి. చిన్న కంపెనీ వ్యాపారాలు  దెబ్బతింటే, పెద్ద కంపెనీలు మాత్రం తమ లాభాలు పెంచుకోగలిగాయి.