అసంపూర్తిగా క్రీడా ప్రాంగణాలు

అసంపూర్తిగా క్రీడా ప్రాంగణాలు

కామారెడ్డి , వెలుగు: జిల్లాలో  ప్రతి హాబిటేషన్​లో ఏర్పాటు చేయాల్సిన క్రీడాప్రాంగణాలు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి.  పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా ఫస్ట్​ విడతలో  ప్రతి మండలానికి 2,  ఆ తర్వాత ప్రతి హాబిటేషన్​లో ఏర్పాటు చేయాలని    ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు ఆట స్థలాలను ఎంపిక చేశారు. కానీ ఫస్ట్ విడతలో పూర్తి చేయాల్సిన పనులు కూడా జిల్లా వ్యాప్తంగా ఏడియాడనే ఉన్నాయి. 

678 హాబిటేషన్లు..

జిల్లాలో3 మున్సిపాల్టీలతో పాటు  22 మండలాల్లో 678 హాబిటేషన్లు ఉన్నాయి.  మున్సిపాలిటీలతో పాటు ప్రతి హాబిటేషన్​లో  ఆట స్థలాలు ఏర్పాటు చేయాలి.   ఫస్ట్​ విడతలో  రూరల్​ ఏరియాల్లో ప్రతి మండలానికి 2 చొప్పున జిల్లాలో 44 పూర్తి చేయాలి.  కానీ ఇప్పటి వరకు 10 మాత్రమే పూర్తయ్యాయి.   కామారెడ్డి, బాన్స్​వాడ, ఎల్లారెడ్డి మున్సిపాల్టీల పరిధిలో కూడా అసంపూర్తిగానే ఉన్నాయి.   ప్రతి చోట  ఎకరం  జాగా గుర్తించి   ప్లే గ్రౌండ్స్​  ఏర్పాటు  చేయాలి.  ఎకరం లేకపోతే  అర ఎకరం జాగా కూడా  తీసుకోవచ్చు. కానీ  జిల్లాలో  ఇప్పటి వరకు 406  హాబిటేషన్లలో స్థలాల ఎంపిక చేయగా.. ఇందులో  44 చోట్ల నే ఎకరం స్థలం దొరికింది. మిగతా చోట్ల  అర ఎకరం స్థలంలోనే ఆట స్థలాలు ఏర్పాటుచేశారు.   స్థలాన్ని చదును చేయటం,   కబడ్జీ, వాలీబాల్​, ఖోఖో,  లాంగ్​జంప్​, హై జంప్​లకు అనువుగా  గ్రౌండ్​ ఏర్పాటు చేయాలి.  ఉపాధి హామీ స్కీమ్​ ఫండ్స్​తో  పనులు  చేయాలి. ఒక్కో  హాబిటేషన్​లో రూ. లక్షా 50వేల నుంచి రూ. 7 లక్షల వరకు ఖర్చు  చేయాల్సి ఉంటుంది.   టౌన్లలో మున్సిపాల్టీ నుంచి ఫండ్స్​ కేటాయించాలి.  

జాగా దొరకనే సమస్య

రూరల్​లో  678 హాబిటేషన్​ ఉంటే   406 చోట్ల మాత్రమే ప్లే గ్రౌండ్లకు జాగాలు ఎంపిక చేశారు. .  మిగతా 252  చోట్ల స్థలం  దొరకడమే సమస్యగా మారింది. అందుబాటులో గవర్నమెంట్​ స్థలాలు లేవు.   భూముల రేట్లు భారీగా  పెరగడంతో ప్రైవేట్​ భూములను విరాళంగా ఇచ్చేందుకు ఎవరూ  ముందుకు వస్తలేరు. కొన్ని చోట్ల  స్కూల్​ గ్రౌండ్​లను సెలక్ట్ చేశారు.   మున్సిపాలిటీల్లో  కూడా ఓపెన్​ ప్లేస్​ల సమస్య ఉంది.  

ఏడియాడనే..

ఫస్ట్​ విడతలో  పూర్తి కావాల్సిన 44 లో  10   చోట్ల మాత్రమే గ్రౌండ్లు రెడీ అయ్యాయి.   మిగతా చోట్ల పనులు  ఏడియాడనే ఉన్నాయి.   కామారెడ్డి మున్సిపాల్టీ పరిధిలో  రెండు చోట్ల ఎంపిక చేయగా   ఒక చోట మాత్రమే గ్రౌండ్​ లెవల్ ​చేశారు.  మరో చోట  బోర్డు ఏర్పాటు చేసి వదిలేశారు. బాన్స్​వాడ టౌన్​లో 7 చోట్ల స్థలాల ఎంపిక చేస్తే  ఇందులో  ఒకటి పూర్తి చేశారు.  ఎల్లారెడ్డిలో   కాలేజీ గ్రౌండ్​లో  మాత్రమే వర్క్స్​  కొనసాగుతున్నాయి. 

వర్క్స్​ స్పీడప్ చేస్తాం

ఆట స్థలాలకు సంబంధించిన వర్క్స్ స్పీడప్​చేస్తాం.   ఫస్ట్ విడతలో  44 వర్క్స్ పురోగతిలో ఉన్నాయి. మిగతా చోట్ల కూడా  వర్క్స్​  షురూ చేస్తాం.  స్థలాల ఎంపిక ఇబ్బంది కావటంతో  పనుల్లో డిలే జరుగుతోంది.  

-  సాయన్న, డీఆర్డీవో