కరెంట్ ఉత్పత్తిని పెంచేందుకు బాగా పనిచేయండి

కరెంట్ ఉత్పత్తిని పెంచేందుకు  బాగా పనిచేయండి
  • జెన్​కో ఇంజినీర్లకు డిప్యూటీ సీఎం భట్టి సూచన 

హైదరాబాద్, వెలుగు: జెన్ కో ఇంజినీర్లు కరెంటు ఉత్పత్తిని పెంచేందుకు మరింత చురుకుగా పని చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. సోమవారం పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రత్నాకర్ రావు, సదానందం ఆధ్వరంలో పలువురు నేతలు డిప్యూటీ సీఎంను కలిశారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్​లో ఉన్న జెన్​కో ఇంజినీర్లకు  ప్రమోషన్లు కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ..  జెన్​కోలో ఏండ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఎలక్ట్రికల్, మెకానికల్, టెలీ కమ్యూనికేషన్ విభాగాల్లోని 170 మంది ఏఈలు, 33 మంది ఏఏఈలకు ఏడీఈలుగా పదోన్నతి కల్పించామన్నారు. జెన్ కో ఇంజినీర్లు మరింత నిబద్ధతతో పని చేస్తూ విద్యుత్ రంగం పురోగతిలో భాగస్వామ్యం కావాలని కోరారు. కాగా, ఇంధన శాఖ సెక్రటరీ రోనాల్డ్ రాస్ ను కూడా అసోసియేషన్​ ప్రతినిధులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ నేతలు వెంకట నారాయణ రెడ్డి, కర్రోళ్ల కిశోర్ కుమార్, సురేశ్ కుమార్, పీవీ రావు, వేణు, అనిల్ కుమార్, సుజిత్, రాజు, రాజేష్, రెమెడీ శ్రీనివాస్, నాగరాజ్ పాల్గొన్నారు.