టెస్టులు పెంచండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

టెస్టులు పెంచండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
  • కరోనా కట్టడిపై కేంద్ర కేబినెట్ సెక్రటరీ రివ్యూ మీటింగ్
  • హాజరైన 8 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు
  • 7 సూచనలు చేసిన రాజీవ్ గౌబా

న్యూఢిల్లీ/ముంబై, వెలుగు: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాలు టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని, ఆర్టీ-పీసీఆర్ టెస్టులు ఎక్కువ చేయాలని కేంద్రం ఆదేశించింది. దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో శనివారం తెలంగాణ,  మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, వెస్ట్ బెంగాల్, జమ్మూకాశ్మీర్ చీఫ్ సెక్రటరీలతో  కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా హైలెవెల్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో  ఆయా రాష్ట్రాల సీఎస్​లతోపాటు ఆరోగ్య శాఖ సెక్రటరీలు, ఐసీఎంఆర్ డీజీ, కేంద్ర హోంశాఖ ప్రతినిధులు, నీతి ఆయోగ్ సభ్యులు పాల్గొన్నారు. కరోనా కొత్త రకాలపై పర్యవేక్షణ, హాట్‌‌స్పాట్ల గుర్తింపు చేపట్టాలని రాజీవ్ గౌబా సూచించారు. కేసులు ఎక్కువున్న జిల్లాల్లో ముందుగా వ్యాక్సినేషన్ చేపట్టాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ టైంలో రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని.. ఫిజికల్ డిస్టెన్స్, మాస్క్ వినియోగం వంటి రూల్స్ తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు. టెస్టింగ్, ట్రాకింగ్, పాజిటివ్ వచ్చినవాళ్లను ఐసోలేట్ చేయడం, కాంటాక్ట్ కేసులను ట్రాక్ చేసి క్వారంటైన్ చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తమ రాష్ట్రంలో కరోనా పరిస్థితి, చేపట్టిన చర్యలపై సీఎస్ లు వివరించారు.  గడిచిన 24 గంటల్లో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్నాటక, తమిళనాడు, గుజరాత్ లో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. మహారాష్ట్రలో చాలా ఎక్కువగా ఒక్క రోజే 8,333 కొత్త కేసులు నమోదు కాగా.. కేరళలో 3,671,  పంజాబ్‌‌లో 622 కొత్త కేసులు రికార్డయ్యాయి. గడిచిన రెండు వారాల్లో మహారాష్ట్రలో  యాక్టివ్ కేసులు 34,449 నుంచి 68,810కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

దేశంలో ఒక్క రోజే 16,488 కేసులు

దేశంలో ఒక్కరోజే 16,488 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఒక  కోటి 10 లక్షల 79 వేల 979కి చేరినట్టు తెలిపింది. ఇందులో కోటి 7 లక్షల 63 వేల 451 మంది కోలుకున్నట్టు వెల్లడించింది. రికవరీ రేటు 97.14 శాతంగా ఉందని తెలిపింది.  1,59,590 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. మొత్తం కేసులో ఇది 1.44 శాతంగా పేర్కొంది.  కరోనాతో ఒక్కరోజే 113 మంది మరణించారని, మొత్తం మృతుల సంఖ్య  1,56,938కి పెరిగినట్టు తెలిపింది. మహారాష్ట్రలో 48, పంజాబ్ లో 15, కేరళలో 14 మంది మరణించారు. డెత్ రేట్ 1.42 శాతంగా ఉన్నట్టు తెలిపింది.

మహారాష్ట్రలోని 36 జిల్లాలకు..

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. రెండు వారాల్లోనే 28 జిల్లాలకు వైరస్ వ్యాపించింది. 10 రోజుల కిందట 21 జిల్లాల్లోనే కరోనా కేసులు రికార్డు కాగా.. ప్రస్తుతం విదర్భ, అమరావతి, అకోలా, బుల్ధానా, యావత్మాల్, నాగ్ పూర్ హాట్ స్పాట్స్ గా మారిపోయాయి. మరాఠ్వాడా రీజియన్ లో లాతూర్, హింగోలి, పర్భనీ, నాందేడ్​లోనూ పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.  ముంబై, పుణె, ఔరంగాబాద్​లోనూ వైరస్ కేసులు పెరుగుతున్నాయి.

కరోనా కట్టడికి కేంద్రం సూచనలు

టెస్టింగ్ పెంచాలి

యాంటీజెన్ టెస్టింగ్ ఎక్కువ ఉన్న చోట ఆర్టీ పీసీఆర్ టెస్టులు  పెంచాలి

కేసులు పెరగకుండా జిల్లాల్లో పర్యవేక్షణపై దృష్టి పెట్టాలి

కరోనా కొత్త రకాలను మానిటర్ చేయాలి, హాట్ స్పాట్లను గుర్తించాలి

ఎక్కువ మరణాలు నమోదవుతున్న జిల్లాల్లో క్లినికల్ మేనేజ్ మెంట్​పై దృష్టి పెట్టాలి

ఎక్కువ కేసులు వస్తున్న జిల్లాల్లో ప్రయారిటీ వ్యాక్సినేషన్ చేపట్టాలి

ప్రజలు కరోనా గైడ్ లైన్స్ పాటించేలా ప్రోత్సహించాలి, వ్యాక్సినేషన్ డ్రైవ్​లో ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.