మూడు రాష్ట్రాల మధ్య తగ్గిన దూరం

మూడు రాష్ట్రాల మధ్య తగ్గిన దూరం

తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల మధ్య ప్రాణహిత, ఇంద్రావతి, గోదావరిపై నిర్మించిన బ్రిడ్జిలు, బ్యారేజీలతో సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగవుతున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చేసే పడవ ప్రయాణాలు, చుట్టూతిరిగి వెళ్లాల్సిన సుదూర ప్రయాణ కష్టాలు తీరాయి. నిజమాబాద్‌-జగ్దల్‌పూర్‌ నేషనల్‌ హైవే-63(ఎన్‌హెచ్‌-63)లో భాగంగా ప్రాణహిత, ఇంద్రావతిపై రెండు బ్రిడ్జిలు కట్టారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద నిర్మిస్తున్న బ్యారేజీలతో మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని భద్రాచలం, విశాఖపట్నానికి దూరభారాలు తప్పాయి.

పూర్తికావొచ్చిన ఇంద్రావతిపై బ్రిడ్జి…

ఎన్‌హెచ్‌-63లో భాగంగా మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల మధ్యనున్న ఇంద్రావతి నదిపై చేపిట్టిన బ్రిడ్జి నిర్మాణం తుదిదశకు చేరుకుంది. రూ.200 కోట్ల ఖర్చుతో 2015 లో ఈ బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికి 80 శాతానికిపైగా పూర్తిచేశారు.

మూడు రాష్ట్రాల వారికి అనుకూలం 

మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల ప్రజలకు తెలంగాణలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల వారితో బంధుత్వాలున్నాయి. మహారాష్ట్రలోని సిరొంచ, అంకిసా, ఆసరెల్లి, సోమన్‌పల్లి ప్రాంతాలు, చత్తీస్‌గఢ్‌లోని తీమెడ, భూపాలపట్నం, మద్దెడ్‌, చల్లువెల్లి వాసులు ప్రతి అవసరం కోసం మంచిర్యాల, చెన్నూరు పట్టణాలకు వస్తుంటారు. ప్రాణహితపై బ్రిడ్జి పూర్తికావడంతో నదిలో పడవ ప్రయాణ కష్టాలు తప్పాయి. ఇంద్రావతిపై వంతెన అందుబాటులోకి వస్తే చత్తీస్‌గఢ్‌ వాసులు కూడా మహారాష్ట్ర నుంచి తెలంగాణకు సులువుగా చేరుకోవచ్చు.

భద్రాచలం, విశాఖకు కూడా…

మంచిర్యాల నుంచి భద్రాచలం వెళ్లాలంటే ప్రస్తుతం వరంగల్​, కొత్తగూడెం మీదుగా సుమారు 272 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఎన్‌హెచ్‌-63తో సిరొంచ, పాతగూడెం, తీమెడ, చింతగూడెం మీదుగా 180 కిలోమీటర్లు ప్రయాణిస్తే భద్రాది రాములోరిని దర్శించుకోవచ్చు. మంచిర్యాల, కుమ్రం భీమ్‌ జిల్లా, పెద్దపల్లి జిల్లాల వారు విశాఖపట్నం పోవాలంటే విజయవాడ మీదుగా సుమారు 750 కిలోమీటర్లు ప్రయాణించాలి. మూడు రాష్ట్రాల మీదుగా నిర్మించిన ఎన్‌హెచ్‌-63తో సిరొంచ, భూపాలపట్నం, పాతగూడెం, జగ్దల్‌పూర్ మీదుగా విశాఖపట్నం వెళ్లవచ్చు. ఈ రూట్‌లో వెళ్తే 600 కిలోమీటర్ల దూరం మాత్రమే వస్తుంది. అలాగే కటక్​, భువనేశ్వర్ కూడా దగ్గరవుతాయి.

అర్జునగుట్ట- సిరొంచ వద్ద ప్రాణహితపై

నిజామాబాద్ నుంచి మహారాష్ట్ర మీదుగా చత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పూర్ వరకు వేస్తున్న సుమారు 600 కిలోమీటర్ల నేషనల్‌ హైవే-63 నిర్మాణం దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈ రూట్‌లో ప్రాణహిత, ఇంద్రావతి నదులు ఉన్నాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం  రాపన్‌పల్లి అర్జునగుట్ట, మహారాష్ట్రలోని సిరొంచ మధ్య ప్రాణహిత నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం 112 కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. 20 ఫిల్లర్లతో 855 మీటర్ల పొడవైన ఈ వంతెన నిర్మాణం ఇటీవల పూర్తయ్యింది. రాకపోకలు సాగుతున్నాయి.

కాళేశ్వరం బ్యారేజీలతో…

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కన్నెపల్లి వద్ద మహారాష్ట్ర, తెలంగాణ మధ్య గోదావరినదిపై 1.60 కిలోమీటర్ల బ్యారేజీ నిర్మించారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వాసులు మంచిర్యాల మీదుగా కేవలం 65 కిలోమీటర్లు ప్రయాణిస్తే చాలు కాళేశ్వరం చేరుకుంటారు. ఇంతకుముందు మంచిర్యాల, గోదావరిఖని, మంథని మీదుగా కాళేశ్వరానికి చేరుకోవడానికి 120 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. అలాగే మంచిర్యాల, కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు మహారాష్ట్రలోని సిరొంచ ఏరియాకు కనెక్టివిటి పెరిగింది. గోదావరినదిపై జయశంకర్​ భూపాలపల్లి జిల్లా అన్నారం వద్ద బ్యారేజీతో కలిపి బ్రిడ్జి నిర్మించారు. చెన్నూరు నుంచి భూపాలపల్లి వెళ్లాలంటే సుమారు 140 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. అన్నారం బ్యారేజీ నిర్మాణంతో కేవలం 60 కిలోమీటర్లలోపే వస్తుంది. గోదావరిపై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు డబుల్ రోడ్లు వేశారు. మేడిగడ్డ బ్యారేజీ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర మధ్య, అన్నారం బ్యారేజీతో జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, సుందిళ్ల బ్యారేజీతో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు దూరం తగ్గడంతోపాటు రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి.