డోర్​ స్టెప్ ​డెలివరీతో పెరిగిన ఉపాధి అవకాశాలు

డోర్​ స్టెప్ ​డెలివరీతో పెరిగిన ఉపాధి అవకాశాలు

హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు బయటకు వెళ్లి తీసుకొచ్చుకునే సరుకులు ఇప్పుడు ఒక్క క్లిక్​తో ఇంటి ముందు ఉంటున్నాయి. బట్టలు, ఇతర వస్తువులే కాదు కూరగాయలు, మెడిసిన్​ఇలా ప్రతి వస్తువును ఆన్​లైన్​లో షాపింగ్ చేసేందుకు సిటిజన్లు మొగ్గుచూపుతున్నారు. జనాల్లో వచ్చిన ఈ మార్పు అనేక మందికి ఉపాధి ఇస్తోంది. డెలివరీ బాయ్స్ రూపంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయి. ఆన్​లైన్​ఆర్డర్లను డెలివరీ చేసేందుకు ఆయా సంస్థలు వేలల్లో డెలివరీ బాయ్స్​ను రిక్రూట్​చేసుకుంటున్నాయి. చిన్న చిన్న సూపర్ మార్కెట్లు, ఫుడ్​కోర్టులు సైతం డోర్ డెలివరీ అందించేందుకు ముందుకొస్తుండడంతో బాయ్స్​ను నియమించుకుంటున్నాయి. ఇలా అనేక మంది యువకులు పార్ట్​టైం, ఫుల్​టైం పద్ధతిలో జాబ్స్ చేస్తున్నారు.

పదుల సంఖ్యలో యాప్‌‌లు

అంతకు ముందు కంటే లాక్​డౌన్​టైంలో ఆన్​లైన్ షాపింగ్ పెరిగింది. కరోనా పరిస్థితులు పోయాక సిటీలోని చాలా మంది దాదాపు ఆన్​లైన్​లోనే కొంటున్నారు. వివిధ రకాల ఆఫర్లు ఉంటుండడంతోపాటు, ఇంటి నుంచి కాలు బయటపెట్టే అవసరం లేకపోవడంతో ఆన్​లైన్ ​మార్కెట్ వినియోగదారులు విపరీతంగా పెరిగారు. సూపర్ మార్కెట్ల నుంచి కిరాణా షాపుల వరకు అన్నీ హోమ్ డెలివరీ అందిస్తున్నాయి. ఫ్లిప్‌‌కార్ట్, అమెజాన్, స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్‌‌ వంటి వాటి తరహాలో డోంజో, బ్లింక్‌‌ఇట్, జెప్టో, ఇన్‌‌స్టా మార్ట్‌‌, హైదరాబాద్ ట్రాలీ ఇలా ఫుడ్, గ్రాసరీ రిలేటెడ్ యాప్‌‌లు అందుబాటులో ఉన్నాయి. పాతవాటితోపాటు కొత్తగా వచ్చిన సంస్థలు తమ కార్యాకలాపాల కోసం ఉద్యోగులను తీసుకుంటున్నాయి. స్టోర్ పనిచేసేందుకు, డెలివరీ బాయ్స్‌‌ గా చేసేందుకు హైర్ చేసుకుంటున్నాయి. సిటీతోపాటు శివారు ప్రాంతాలకు సేవలను విస్తరించడంతో ఎక్కడ చూసినా డెలివరీ బాయ్స్​ కనిపిస్తున్నారు.

10 నిమిషాల్లో ఇంటి ముందు

కొన్ని రకాల వస్తువులను ఆర్డర్ చేసిన నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేస్తున్నారు. పాలు, గుడ్లు, కూరగాయలు, కిరాణా సరుకులను గంట లోపే డెలివరీ చేస్తుండడంతో జనం కూడా వీటికే మొగ్గు చూపుతున్నారు. మార్కెట్ లో పోటీని తట్టుకునేందుకు కొన్ని కంపెనీలు కొత్త పద్ధతుల్లో ప్రమోషన్లు చేస్తున్నాయి. ఫాస్ట్ డెలివరీ చేయాలంటే అందుకు తగినట్టుగా డెలివరీ బాయ్స్ ఉండాలి. అందుకే ఒక్కో సంస్థ ఏరియా చొప్పున కొంతమంది డెలివరీ బాయ్స్​ను అపాయింట్ చేసుకుంటున్నాయి. ఆర్డర్​వచ్చిన 10 నుంచి20 నిమిషాల్లోనే డెలివరీ చేసేలా చూస్తున్నాయి. ఇందులో ఇతర ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఉంటున్నారు. అవకాశం ఉన్న టైంలో పార్ట్​టైం జాబ్స్ చేస్తున్నారు. ఇలా గ్రేటర్​ వ్యాప్తంగా వేల మంది ఉపాధి పొందుతున్నారు. 

మంచి జీతం వస్తోంది

నేను ఇంటర్ చదివాను. కరోనా టైంలో ఖాళీగా ఉన్నాను. ఆ తర్వాత కొన్ని రకాల పనులు చేశాను. వచ్చే డబ్బులు సరిపోయేవి కాదు. ఆ తర్వాత ఓ కంపెనీలో డెలివరీ బాయ్​గా చేరాను. రోజుకి కొన్ని గంటలు వర్క్ చేస్తే సరిపోతుంది. మంచి జీతం వస్తోంది. - సోమేశ్, డెలివరీ బాయ్, మణికొండ

పార్ట్​టైంగా​ చేస్తున్న

ప్రస్తుతం ఖర్చులు చాలా పెరిగాయి. వచ్చే జీతం సరిపోవడం లేదు. అందుకే ఆఫీస్​ అయిపోయాక సాయంత్రం పూట ఫుడ్ డెలివరీ చేస్తున్నాను. కరోనా తర్వాత కొన్నిరోజులు చేసి ఆపేశాను. మళ్లీ ఇప్పుడు స్టార్ట్ చేశా. వారానికి రూ.4 వేలకుపైగానే ఆదాయం వస్తోంది. 
‌‌‌‌- ప్రభాకర్, పార్ట్​టైం డెలివరీ బాయ్, ఖైరతాబాద్