పంట అమ్మినంక పెరిగిన పత్తి రేటు

V6 Velugu Posted on Jun 08, 2021

లాభాలు  వ్యాపారుల జేబుల్లోకే..
రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన పత్తిని వ్యాపారులు మొదట్లో సీసీఐకి ఎక్కువ రేటుకు అమ్ముకున్నారు. ఇప్పుడు సీజన్​ ఎండింగ్ కావడం.. మార్కెట్​ కు పెద్దగా పత్తి రాకపోవడంతో ఇంటర్నేషనల్​ మార్కెట్ లో కాటన్​ బేళ్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. అంతేగాకుండా నూనెల తయారీలో ఉపయోగించే పత్తి గింజలకు కూడా  రేటు పెరిగింది. ఇది వరకు రూ.2,300 వరకు పలికిన గింజలకు ఇప్పుడు రూ.2,500 వరకు ధర పెరగడంతో ఆటోమెటిక్​గా పత్తికి రేటు వచ్చిందని వ్యాపారులు చెబుతున్నారు. అన్​ సీజన్ తో ఇప్పుడు మార్కెట్లకు పత్తి తక్కువగా వస్తుండగా..  వచ్చిన దాన్ని వ్యాపారులు పోటీ పడి కొంటున్నారు. ఇప్పటికే రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి పెట్టుకున్న పత్తితో పాటు ఇప్పుడు కొనుగోలు చేసిన దానికి డిమాండ్​ పెరిగిపోవడంతో ఇప్పుడు ఎక్స్​ పోర్ట్ చేస్తున్నారు. దీంతో పత్తి రైతులకు అందాల్సిన లాభాలన్నీ వ్యాపారుల జేబుల్లోకి వెళ్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

వరంగల్, వెలుగు: పత్తి సీజన్​ ముగిసి రైతులు పంటంతా అమ్ముకున్నాక  ఇప్పుడు కాటన్​ రేట్లు పెరిగాయి. గత వానకాలం సీజన్​కు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్​ వరకు మార్కెట్లకు వచ్చిన పత్తికి కేంద్రం ప్రకటించిన రూ.5,825 మద్దతు ధర  దక్కింది చాలా తక్కువ. సీజన్​ మొదట్లో రకరకాల సాకులతో వ్యాపారులు రూ.2 వేల నుంచి రూ.4 వేల లోపు కొనుగోలు చేయగా..  ఇప్పుడు  అంతర్జాతీయ మార్కెట్​లో పత్తికి ఫుల్​ డిమాండ్​ పెరగడంతో  గరిష్ఠంగా రూ.7 వేలు పెట్టి కొంటున్నారు. పంట అంతా అమ్ముకున్న తరువాత రేటు పెరగడంతో వ్యాపారులు లాభపడగా, రైతులు ఎప్పట్లాగే మునిగారు. 
సగానికి తగ్గిన దిగుబడులు.. 
రాష్ట్రంలో సాధారణ పత్తి సాగు విస్తీర్ణం 45 లక్షల ఎకరాలు కాగా నిరుడు వానాకాలం 60.36లక్షల ఎకరాల్లో సాగైంది.  మొత్తం 54.81లక్షల టన్నుల దిగుబడి  వస్తుందని సర్కారు అంచనా వేయగా.. భారీ వర్షాలు, తెగుళ్ల కారణంగా దిగుబడులు సగానికి సగం పడిపోయాయి. ఎకరానికి 10 నుంచి15 క్వింటాళ్లు  రావాల్సిన పత్తి ఐదు నుంచి ఆరు క్వింటాళ్లకు మించి రాలేదు. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా కేవలం 30 లక్షల టన్నుల వరకు దిగుబడి రాగా సీసీఐ ద్వారా 17.73లక్షల టన్నులు, మరో 12.27లక్షల టన్నులు  ప్రైవేటు వ్యాపారులు కొన్నట్లు అంచనా.
క్వాలిటీ పేరు చెప్పి దోపిడీ
కేంద్రం 8 శాతం కంటే తక్కువ తేమ ఉన్న పత్తికి రూ.5,825 మద్దతు ధర ప్రకటించగా..  సీసీఐ ఆఫీసర్లు రైతులకు ఆ రేటు కట్టించింది మాత్రం చాలా తక్కువే. సీజన్​ స్టార్టింగ్​లో వానలు పడడంతో  పత్తి రంగు మారిందనో.. క్వాలిటీ బాగాలేదనో.. తేమను సాకుగా చూపి రైతుల నుంచి వ్యాపారులు అగ్గువకే కొనుగోలు చేశారు. దీంతో సీసీఐ ఆఫీసర్లు, వ్యాపారులు, దళారులు కుమ్మక్కవడం వల్ల  రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదనే ఆరోపణలు వినిపించాయి. అంతేగాకుండా అప్పటికే దిగుబడి తగ్గి నష్టాల్లో ఉన్న రైతులు చేతి అవసరాల కోసం వ్యాపారులు చెప్పిన రేటుకే పంటను అమ్ముకోవాల్సి వచ్చింది. దీంతో పంట మీద వేలకు వేలు ఖర్చు పెట్టిన రైతులకు కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. 
రూ.9 వేల కోట్లకుపైగా నష్టం
పంట చేతికి వచ్చే దశలో భారీగా వర్షాలు పడటంతో తేమ పేరుతో వ్యాపారులు రైతులను దోచుకున్నారు. సీజన్​ ప్రారంభంలో సీసీఐ రంగంలోకి దిగక క్వింటాల్​కు వ్యాపారులు ఇష్టారీతిన మాయిశ్చర్​ అంచనా వేసి రూ.2వేల నుంచి రూ.3వేలకు మించి ధర పెట్టలేదు. ఆ తర్వాత సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించినప్పటికీ గరిష్ఠంగా క్వింటాల్​కు రూ.5,825 మాత్రమే చెల్లించింది. సగటున పత్తి రైతులకు క్వింటాల్​కు రూ.4వేలకు మించి దక్కలేదు. తాజాగా సీజన్​ అయిపోయాక వరంగల్​ ఏనుమాముల మార్కెట్​లో సోమవారం క్వింటాల్​ పత్తి ధర రూ.7వేలు పలికింది. ఈ లెక్కన ఒక్కో క్వింటాల్​పై రైతులు రూ.3వేల చొప్పున 30 లక్షల టన్నులపై రైతులు రూ.9 వేల కోట్లకు పైగా నష్టపోయినట్లు తెలుస్తోంది.

Tagged increased, cotton, crop, , Farmer\\\'s

Latest Videos

Subscribe Now

More News