కరీంనగర్ డెయిరీతో పాల వెల్లువ.. 12 వేల లీటర్లతో మొదలై.. 2 లక్షల లీటర్ల సేకరణతో కంపెనీ వృద్ధి

కరీంనగర్ డెయిరీతో పాల వెల్లువ.. 12 వేల లీటర్లతో మొదలై.. 2 లక్షల లీటర్ల సేకరణతో కంపెనీ వృద్ధి
  •     5 లక్షల లీటర్ల పాల సేకరణ లక్ష్యంగా ముందుకు 
  •     లక్ష మంది పాడి రైతులకు భరోసా
  •     రాష్ట్రవ్యాప్తంగా విస్తరణకు అడుగులు

కరీంనగర్, వెలుగు: గత ఐదున్నర దశాబ్దాలుగా పాల సేకరణ, అమ్మకాల్లో కరీంనగర్ డెయిరీ తనదైన మార్క్ చూపుతోంది. డెయిరీ రంగంలో లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రాష్ట్రంలోని ఇతర డెయిరీలకు ఆదర్శంగా నిలుస్తోంది. 1971లో 12 వేల లీటర్ల పాల సేకరణతో ప్రారంభమైన కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెయిరీ.. ఇప్పుడు రోజూ 2 లక్షల లీటర్ల పాలు సేకరిస్తూ.. మరో 3 లక్షల లీటర్ల పాల సేకరణే లక్ష్యంగా పెట్టుకుంది. 

రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని 1,300 గ్రామాల నుంచి పాలు సేకరిస్తోంది. శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్‌‌‌‌‌‌‌‌ను ఆదర్శంగా తీసుకొని కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్ రావుతో పాటు పాలకవర్గ సభ్యులు, సిబ్బంది నిరంతర కృషి ఫలితంగా గత రెండు దశాబ్దాలుగా లక్ష మంది పాడి రైతులకు భరోసా కల్పించే కంపెనీగా ఎదిగింది. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెయిరీని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్ రావు వెల్లడించారు. పాలను సేకరించిన 24 గంటల్లో వినియోగదారులకు అందజేయడం తమ ప్రత్యేకత ఆయన పేర్కొన్నారు. 

పాలు, పెరుగు నుంచి స్వీట్ల వరకు.. 

కరీంనగర్ డెయిరీ నుంచి ప్యూర్, టోన్డ్ పాలతో పాటు గోల్ఫ్ టీ స్పెషల్ పాలు లభిస్తున్నాయి. ప్రతి రోజు లక్షా 20 వేల లీటర్ల పాలు, 80 వేల లీటర్ల పెరుగు అమ్మకాలు జరుగుతున్నాయి. తిమ్మాపూర్ మండలం నల్లగొండలోని 3 లక్షల లీటర్ల సామర్థ్యంతో అత్యాధునిక సాంకేతికతతో పూర్తిగా ఆటోమేటెడ్ మెగా డెయిరీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను నెలకొల్పారు. డెయిరీ నుంచి పెరుగు ప్యాకెట్లతో పాటు 1, 2, 5, 10 నుంచి 40 కిలోల వరకు బకెట్ల రూపంలో ఫంక్షన్లకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అలాగే, బాదం మిల్క్ వివిధ రకాల ఫ్లేవర్లలో లభ్యమవుతోంది.

 బటర్ మిల్క్‌‌‌‌‌‌‌‌, దూద్ పేడ, మలాయి, లడ్డూ, మిల్క్ కేక్ తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారు చేసే బాసుంది, కోవా జామూన్, నెయ్యికి రాష్ట్ర నలుమూలల నుంచి బల్క్ ఆర్డర్లు వస్తున్నాయి. స్పెషల్ లస్సీ, జీరా బట్టర్ మిల్క్, కోవా జామూన్, పన్నీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు నెయ్యిని ఉత్పత్తి చేస్తున్నారు. 2026 జనవరి వరకు పూర్తిగా నెయ్యితో చేసిన స్వీట్లను మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఆవు పాలతో చేసిన నెయ్యిని కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు డెయిరీ చైర్మన్ రాజేశ్వర్ రావు వెల్లడించారు. అలాగే, ఐస్ క్రీమ్‌‌‌‌‌‌‌‌లు, బిస్కెట్స్ తయారు చేసి మార్కెట్‌‌‌‌‌‌‌‌లో తీసుకొస్తామని చెప్పారు. 

యాప్‌‌‌‌‌‌‌‌లో ఆర్డర్ చేస్తే ఇంటికే పాలు..

కరీంనగర్ డెయిరీ యాప్‌‌‌‌‌‌‌‌ నుంచి ఆర్డర్ చేస్తే అర గంటలో పాలు, పాల ఉత్పత్తులు ఇంటి వద్దకే డెలివరీ చేయనుంది. అయితే, ఈ యాప్‌‌‌‌‌‌‌‌లో కనీసం రూ.200 మేర ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఎమ్మార్పీపై 10 శాతం డిస్కౌంట్‌‌‌‌‌‌‌‌తో పాలు, పాల ఉత్పత్తులను వినియోగదారుల ఇంటి వద్దకు చేర్చుతామని రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు తెలిపారు. వివరాలకు 91777 -37070, 98489 -38996ను సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం కరీంనగర్ సిటీలో ఉన్న ఈ యాప్ సౌకర్యాన్ని ఈ నెలలో జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, హనుమకొండ, వరంగల్‌‌‌‌‌‌‌‌లోనూ తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. 

రెండు కండ్లుగా వ్యాపారం..పాడి రైతుల సంక్షేమం.. 

పాలు, పెరుగు, పాల ఉత్పత్తుల వ్యాపారం.. పాడి రైతుల సంక్షేమం రెండు కండ్లుగా భావించి డెయిరీ పాలకవర్గం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. 50% సబ్సిడీతో పశువుల వ్యాధి నిరోధక టీకాలు, 75 శాతంతో నట్టల మాత్రలు, 50 శాతం సబ్సిడీతో మేలు రకపు పశుగ్రాస విత్తనాలు, 25 శాతం సబ్సిడీతో మినరల్ మిక్చర్, 50 శాతం సబ్సిడీపై చాప్ కట్టర్లను అందజేస్తున్నారు. మేలుజాతి పశువుల అభివృద్ధికి కృత్రిమ గర్భోత్తత్తికి, ఆడ దూడలు జన్మించడం కోసం 50 శాతం నబ్సిడీపై సాల్టెడ్ సెమెన్ సరఫరా చేస్తున్నారు. మేలు జాతి పశువుల కొనుగోలుకు రైతులకు రూ.60 వేల వరకు లోన్, ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తే, 90 శాతం సబ్సిడీ అందిస్తున్నారు.

 పాడి పశువులు మరణిస్తే సభ్యులకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ఆర్థిక సాయం చేస్తున్నారు. పాడి భరోసా స్కీంలో భాగంగా పాల ఉత్పత్తిదారులు రూ.200 చెల్లిస్తే పాడి రైతు మరణిస్తే రూ.50 వేల వరకు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్నారు. పాల ఉత్పత్తిదారుల సంక్షేమ గుర్తింపు కార్డు కలిగి ఉన్న పాడి రైతు మరణిస్తే రూ.5 వేలు, సంస్థ అధ్యక్షుడు మరణిస్తే రూ.7 వేలు అంత్యక్రియలకు ఇస్తున్నారు. కళ్యాణమస్తు పథకం ద్వారా పెళ్లి సమయంలో పుస్తె, మట్టెలు, పసుపు, కుంకుమ అందజేస్తున్నారు. 18- ఏండ్ల నుంచి 60 ఏండ్ల మధ్య వయసున్న ఉన్న పాడి రైతులకు వృద్ధాప్య సంక్షేమ పథకం అమలు చేస్తున్నారు. 

ఐదు లక్షల లీటర్ల పాల సేకరణే లక్ష్యంమా డెయిరీ పరిధిలోని రైతులకు అనేక రాయితీలు ఇస్తూ, పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాం. ఒకప్పుడు కేవలం 20 వేల లీటర్ల సేకరణ ఉన్న మా డెయిరీ ప్రస్తుతం లక్షన్నర నుంచి రెండు లక్షల లీటర్ల సేకరణ వరకు వచ్చింది. నాణ్యతలో రాజీపడకుండా వినియోగదారులకు పాలు, పాల పదార్థాలు అందిస్తున్నాం. పాడి పరిశ్రమను మరింత ప్రోత్సహించేందుకు తిమ్మాపూర్‌‌‌‌‌‌‌‌ మండలం నుస్తులాపూర్‌‌‌‌‌‌‌‌ వద్ద 3 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న డెయిరీని ఏర్పాటు చేశాం. భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో మా పాల సేకరణను 5 లక్షల లీటర్ల వరకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వినియోగదారుల ఆదరణ, సిబ్బంది కృషి, పాడి రైతుల సహకారంతో డెయిరీని రాష్ట్రంలో నంబర్ వన్‌‌‌‌‌‌‌‌గా నిలిపేందుకు కృషి చేస్తున్నాం. - చల్మెడ రాజేశ్వర్ రావు, కరీంనగర్ డెయిరీ చైర్మన్