బ్యాంక్ అకౌంట్ నామినీ రూల్స్ మారాయి.. భార్య, తల్లి మాత్రమే కాదు.. నలుగురు ఉండొచ్చు..!

బ్యాంక్ అకౌంట్ నామినీ రూల్స్ మారాయి.. భార్య, తల్లి మాత్రమే కాదు.. నలుగురు ఉండొచ్చు..!

నవంబర్ 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారుల కోసం నామినేషన్ నిబంధనల్లో కొత్త మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. ఇప్పటికే నామినీ వ్యవస్థ వల్ల వారసత్వ వివాదాలు, క్లెయిమ్స్ విషయంలో జాప్యాలు జరుగుతున్నాయి. వీటిని శాశ్వతంగా పరిష్కరించేందుకు.. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ సంయుక్తంగా కొత్త మార్గదర్శకాలతో బ్యాంకింగ్ చట్టంలో సవరణలను తీసుకొచ్చింది. అయితే కొత్తగా వస్తున్న ఈ మార్పులు ఎలాంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయి, బ్యాంక్ ఖాతాదారులకు ఏఏ ప్రయోజనాలను అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

దేశంలోని బ్యాంక్ ఖాతాదారులు ఇకపై తమ సేవింగ్స్ అకౌంట్లకు ఒకరికి బదులుగా గరిష్ఠంగా నలుగురు నామినీలుగా ఎంచుకునే అవకాశం కల్పించబడింది. ప్రజలు కొత్త బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసే సమయంలో లేదా తరువాత ఎప్పుడైనా తమ నామినీల వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు.​అలాగే డిపాజిట్ ఖాతాలకు ఒకేసారి లేదా ఒకరి తర్వాత మరొకరిని కూడా నామినీలుగా చేర్చేందుకు రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పిస్తోంది కొత్త చట్ట సవరణ ద్వారా. అలాగే.. బ్యాంక్ లాకర్లు, సేఫ్ కస్టడీ వగైరాల విషయంలో మాత్రం కేవలం ఒకరి తర్వాత ఒకరు పద్ధతిలోనే నామినేషన్ చేసేందుకు వీలుటుందని వెల్లడైంది. ​

బ్యాంక్ ఖాతా ఉన్న కస్టమర్లు ఎంపిక చేసుకున్న నామినీల్లో ప్రతి ఒక్కరికి ఎంత శాతం వాటాపై హక్కు ఇవ్వాలనే ఎంపికకు కూడా వెసులుబాటు కల్పించబడింది. ఉదాహరణకు అకౌంట్ హోల్డర్ నలుగురు నామనీలను ఎంపిక చేసుకున్నట్లయితే ఖాతాకు.. అందులో ఒకరికి 50%, మరొకరికి 20%, మిగతా ఇద్దరికి సమానంగా 15% చొప్పున హక్కును కేటాయించవచ్చు. ఇదంతా కలిపితే మొత్తంగా 100% మించకూడదని గుర్తుంచుకోండి. ఒకప్పుడు కేవలం భార్యకు 100 శాతం లేదా తల్లికి 100 శాతం నామినీ హక్కు ఇవ్వటంతో ఖాతాదారుల మరణం తర్వాత గొడవలు జరిగేవి. ఇకపై ఇలాంటి సమస్య లేకుండా బ్యాంక్ అకౌంట్ హోల్డర్ మెుత్తం ఉన్న డబ్బును ఎంతెంత ఎవరికి దక్కాలో నలుగురి నామినీలను ఎంచుకునేందుకు కొత్త చట్ట సవరణ వీలు కల్పించింది.  

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ మార్పులతో నామినీల వ్యవస్థ పారదర్శకంగా మారనుంది. దీనికి తోడు సర్వసాధారణంగా మారిన వారసత్వ వివాదాలను కొత్త వ్యవస్థ తగ్గిస్తుంది. పైగా క్లెయిమ్ సెటిల్మెంట్స్ కూడా వేగంగా పూర్తవుతాయి. బ్యాంకులు తమ ఖాతాదారులకు ఖచ్చితంగా నామినేషన్ ఫీచర్‌ను వివరించాలన్న నిబంధనను కూడా ఆర్బీఐ తీసుకురావటం సంతోషకరమని కస్టమర్లు అంటున్నారు. కొత్తగా తెరిచే ఖాతాలకే కాకుండా.. ​ఇప్పటికే ఉన్న ఖాతాల్లో కూడా నామినీల సంఖ్యను పెంచుకోవచ్చు, వారికి వాటాలను నిర్థేశించుకోవచ్చు. త్వరలోనే కొత్త నామినేషన్ రూల్స్‌కు సంబంధించిన ప్రత్యేక ఫారం, విధివిధానాలు కూడా బ్యాంకులు తెలియజేస్తాయి.​కొత్తగా తెచ్చిన నలుగురు నామినీల రూల్స్ నంబర్ 1, 2025 నుంచి అధికారికంగా అమలులోకి రావటం ఖాతాదారులకు ప్రయోజనకరంగా చెప్పుకోవచ్చు.