కాన్ బెర్రా: ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా వన్డే టీమ్ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హెల్త్ కండిషన్‌పై బీసీసీఐ బిగ్ అప్డేట్ ఇచ్చింది. అయ్యర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్ అయినట్లు వెల్లడించింది. ఫ్లైట్ జర్నీకి అయ్యర్ ఆరోగ్యం సహకరించినప్పుడు అతడిని తిరిగి ఇండియా తీసుకోస్తామని బీసీసీఐ తెలిపింది. అయ్యర్ త్వరగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో అతడి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
‘‘అయ్యర్ ఆరోగ్యం ఇప్పుడు స్థిరంగా ఉంది. బాగా కోలుకుంటున్నాడు. సిడ్నీ, భారతదేశంలోని నిపుణులతో పాటు బీసీసీఐ వైద్య బృందం అతడు త్వరగా కోలుకోవడం పట్ల సంతోషంగా ఉన్నారు. శనివారం (నవంబర్ 1) అయ్యర్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. శ్రేయాస్‌కు బెస్ట్ ట్రీట్మెంట్ అందించిన సిడ్నీలోని డాక్టర్ కౌరౌష్ హఘిగి, అతని బృందానికి అలాగే ఇండియాలోని డాక్టర్ దిన్షా పార్దివాలాకు బీసీసీఐ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. శ్రేయాస్ తదుపరి సంప్రదింపుల కోసం సిడ్నీలోనే ఉంటాడు. అతను విమాన ప్రయాణానికి ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత భారతదేశానికి తిరిగి వస్తాడు’’ అని ప్రకటనలో బీసీసీఐ పేర్కొంది.
ALSO READ : రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు బద్దలు
కాగా, ఇండియా, ఆస్ట్రే్లియా మధ్య సిడ్ని వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. అలెక్స్ క్యారీ కొట్టిన బంతిని క్యాచ్ పట్టే క్రమంలో కిందపడటంతో పక్కటెములకు తీవ్ర గాయమైంది. దీంతో గ్రౌండ్‌లోనే నొప్పితో అల్లాడిపోయాడు అయ్యర్. జట్టు సహయక సిబ్బంది వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో సిడ్నిలోని ఓ ఆసుపత్రిలో ఐసీయూలో అయ్యర్‌కు చికిత్స అందించారు. అయ్యర్ కోలుకోవడంతో అతడిని డిశ్చార్జ్ చేశారు వైద్యులు.
